ఇద్దరు ‘రెడ్డి’లు – ఒక నియోజకవర్గం : తలపట్టుకున్న వైఎస్ జగన్ 

political
అధికార పార్టీ వైసీపీ లో అంతర్గత కలహాలు రోజు రోజుకూ ముదురుతున్నాయి.  పాత, కొత్త నేతలకు అస్సలు పడట్లేదు.  చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.  వాటిలో జమ్మలమడుగు కూడ చేరింది.  జమ్మలమడుగులో టీడీపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తి రామసుబ్బారెడ్డి.  గత ఎన్నికలతో కలిపి మొత్తం నాలుగుసార్లు టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆయన ఓడిపోతూనే ఉన్నారు.  వరుసగా ఓడిపోయినా ఆయనకు బలగం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు.  రామసుబ్బారెడ్డి సైతం తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి చేసి రాటుదేలిపోయారు.  పదవి లేకున్నా కూడా నియోజకవర్గంలో ఆయన ప్రాభవం గట్టిగానే పనిచేస్తుంది. 
political
 
2019 ఎన్నికల్లో సైతం వైసీపీతో హోరాహోరీగా పోరాడిన ఆయణ ఎన్నికల అనంతరం ఏమనుకున్నారో ఏమో కానీ సుధీర్ఘ కాలం పనిచేసిన టీడీపీ ని వీడి వైసీపీ జెండా పట్టుకున్నారు.  వైసీపీలో చేరే సమయంలో ఎంతో ఘర్షణకు గురైయ్యారు.  చివరికి పెద్ద ప్రయోజనాలను ఆశించి వైసీపీలోకి వెళ్లారు.  దీంతో ఆయన సొంత క్యాడర్ కూడా అయిష్టంగానే వైసీపీ జెండాలు ఎత్తారు.  కానీ ఈ పరిణామం వైసీపీ శ్రేణులకు నచ్చలేదు.  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సర్దుకుందామని అనుకున్నా వాళ్లు మాత్రం సర్దుకోలేకపోతున్నారు.  కారణం ప్రజెంట్ వైసీపీ క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుండి బయటికొచ్చినవారే.  
 
వారంతా సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి రామసుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు.  వారిలో చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా రామసుబ్బారెడ్డి ప్రభావంతో ఇబ్బందులు పడ్డవారే.  అందుకే రామసుబ్బారెడ్డితో, ఆయన అనుచరులతో అంత ఈజీగా కలవలేకపోయారు.  ఫలితంగా అధికార పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి.  క్యాడర్ ఒత్తిడితో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం రామసుబ్బారెడ్డిని దూరం పెట్టవలసి వచ్చింది.  పార్టీ కార్యకలాపాలకు సైతం రామసుబ్బారెడ్డికి ఆహ్వానం అందని పరిస్థితి.  దీంతో రామసుబ్బారెడ్డికి అహం దెబ్బతింది.  పట్టువీడి పార్టీలోకి వస్తే ఇలా అవమానిస్తారా అంటూ గుర్రుగా ఉన్నారట.  ఇలా రెండు ప్రధాన వర్గాల నడుమ వైరం పెరగడం వైఎస్ జగన్ కు సైతం తలనొప్పిగా పరిణమించింది.