తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా వాసాలమర్రి అనే గ్రామానికి 100 కోట్ల నిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 100 కోట్లను కేసీఆర్ ఏదో సరదా కోసం ఇస్తున్నవి కావు. అభివృద్ధి కోసం ఇస్తున్నవి. వెళ్తూ వెళ్తూ గ్రామంలో ఆగి ఒక్కసారి పరికించి చూసిన ఆయనకు అక్కడి అభివృద్ధిలో వెనుకబాటుతనం కొటొచ్చినటు కనిపించింది. అందుకే గ్రామ పెద్దలను తనవద్దకు పిలిపించుకుని 100 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే వ్యవసాయం చేయడానికి భూమిని ఇస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని, ప్రతి ఇంటికీ 10 లక్షలతో శాశ్వత ఉపాధిని కల్పిస్తామని అన్నారు. ఇవి సంక్షేమ పథకాలు కాదు. అభివృద్ధికి ఉపకరించే హామీలు.
కేసీఆర్ ఇచ్చారు సరే మరి దానికి జగన్‌కు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా.. ఉంది. అదే అభివృద్ధికి, సంక్షేమానికి తేడాను గుర్తించడం. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎదురైన ఈ అనుభవం సంక్షేమానికి, అభివృద్ధికి మధ్యన ఉన్న సన్నని గీతను స్పష్టంగా కనబడేలా చేసింది. వాసాలమర్రి గ్రామ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందట్లేదా అంటే అందుతున్నాయి. మిషన్ భగీరథ మంచి నీరు, సాగునీరు, ఉచిత కరెంట్, పింఛన్లు, ఇతరాత్ర పథకాలు బాగానే అందుతున్నాయట. కానీ అభివృద్ధి మాత్రం లేదక్కడ. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే శాశ్వత ఉపాధి అనేది ఉండాలి. సంపద సృష్టించగల సామర్థ్యం జనానికి రావాలి.
వాటి కోసమే ప్రతి ఇంటికీ 10 లక్షలతో ఉపాధి చూపడం, రైతులకు వ్యవసాయం కోసం భూమిని ఇవ్వడం చేయాలని భావించారు కేసీఆర్. జగన్‌గారు కూడ ఇదే తెలుసుకోవాలి. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అది అభివృద్ధికి సమానం కాలేవు. జనాల ఖాతాల్లోకి కొంచెం కొంచెంగా డబ్బును బదిలీ చేయడం వలన వారికి తాత్కాలిక ఆనందం, కష్టాల నుండి కాసేపు వెసులుబాటు దొరుకుతుందేమో తప్ప వారి బ్రతుకుల్లో శాశ్వతమైన మలుపు చోటు చేసుకోదు. అలాంటి మలుపు కేవలం అభివృద్ధి ద్వారానే సాధ్యం. ఈరోజు అభివృద్ధి మీద ఎంత ఎక్కువ ఖర్చుపెడితే భవిష్యత్తులో అంత దృఢమైన సమాజం, జీవన ప్రమాణాలు అందుతాయి. కాబట్టి ఇకనైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడ జగన్ దృష్టిపెడితే బాగుంటుంది.