ఆంధ్రాకు విశాఖపట్నం ప్రధాన ఆదాయ నగరం. పారిశ్రామికంగా అన్ని విధాల విశాఖ అభివృద్ది చెందిన నగరం. రాష్ట్రం విడిపోనప్పుడు చాలా మంది విశాఖను రాజధానిని చేయవచ్చు కదా అన్నారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఆయన దిగిపోయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో సీన్ మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రి మూడు రాజధానులు అనే కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా ఆయన విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి ప్రతిపక్షాలు అడ్డుపడినా జగన్ ఆగట్లేదు. దాదాపుగా ప్రక్రియ మొత్తం పూరైంది. కానీహైకోర్టు రాజధానిని విశాఖకు తరలించకూడదని స్టేటస్ కో ఇచ్చింది. దీంతో జగన్ ఆశలకు బ్రేకులు పడ్డాయి.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని తన పేరు మీదే కట్టుకున్నారు. అమరావతి విషయంలో కొత్త రాజధాని అనే మాట కంటే చంద్రబాబు కడుతున్న నగరమనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే జగన్ కు నచ్చలేదు. యిపుడు తాను పూనుకుని అమరావతిని పూర్తిచేసినా క్రెడిట్ మొత్తం చంద్రబాబు కొట్టేస్తారని ఆయనకు తెలుసు. అసలే ఇలాంటి విషయాల్లో బాబుగారు దిట్ట. అందుకే అసలు రాజధానిని మార్చేస్తే ఏ గొడవా ఉండదని భావించి విశాఖ మీద జగన్ దృష్టిపెట్టారు. పాలనను విశాఖ నుండి చేయాలనీ ఉవ్విళ్ళూరారు. గత ఏడాది ఉగాది నాటికే విశాఖ నుడి పాలన మొదలుకావాలి. కానీ కరోనా, కోర్టు ఇచ్చిన స్టేటస్ కో మూలాన నిలిచిపోయింది.
కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైందని అంటున్నారు వైసీపీ నేతలు. 2021 ఉగాది నాటికి విశాఖ రాజధానిగా ఆవిష్కృతమవుతుందని అంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కూడ. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సచివాలయ భవనాలను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే రాజధాని అంశం కోర్టులో విచారణకు వస్తుందని, ఈసారి మాత్రం అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. చీఫ్ జస్టిస్ మారడం తమకు కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈసారి వాదనల్లో ఎన్నాళ్లిలా ఖచ్చితమైన రాజధాని లేకుండా పాలన చేయడం అనే అంశాన్ని హైలెట్ చేయాలని, తద్వారా కోర్టులో నెగ్గుకురావాలని చూస్తున్నారు. మరి గత ఉగాది నాడు గల్లంతైన జగన్ ఆశలు ఈసారి ఉగాదికి నెరవేరుతాయేమో చూడాలి.