వైసీపీ కొంప ముంచనున్న వైఎస్ జగన్ ‘దుష్ట చతుష్టయం’.!

Ys Jagan In Self Destruction Mode

Ys Jagan In Self Destruction Mode : అధికారిక కార్యక్రమాల్ని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ వుండదు. ఈ విషయాన్ని చంద్రబాబుని చూసైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోకపోవడం శోచనీయం.

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారిక కార్యక్రమాల్ని కేవలం రాజకీయ కార్యక్రమాలుగా చంద్రబాబు మార్చేసిన వైనం అందరికీ గుర్తుండే వుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ విమర్శలు, అధికారిక వేదికలపై అధికారంలో వున్నవారికి తప్పకపోవచ్చు. కానీ, అదే పనిగా.. అధికారిక కార్యక్రమాల్ని కేవలం రాజకీయ విమర్శలకు పరిమతం చేస్తే ఎలా.?

తిరుపతిలో తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ‘బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేసే’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం కోసం పెద్దయెత్తున జనాన్ని సమీకరించారు. జగన్ ప్రసంగం ఇలా ప్రారంభం కాగానే, అలా కొందరు జనం గోడలు దూకి మరీ పారిపోయారు.

రాజకీయ పార్టీల బహిరంగ సభల పట్ల ప్రజల్లో వున్న చిన్న చూపుకి ఈ ఘటన నిదర్శనం. ‘దుష్ట చతుష్టయం’ అంటూ వైఎస్ జగన్ పాత పాటే పాడారు, తన రాజకీయ ప్రత్యర్థుల మీద. కొన్ని మీడియా సంస్థల్నీ, టీడీపీనీ వైఎస్ జగన్ టార్గెట్‌గా చేసుకున్నారు. కానీ, మెప్పించాల్సింది ప్రజల్ని. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పుకోవడంతోపాటుగా, ప్రజలకు భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి అన్నాక. అది మర్చిపోతే ఎలా జగన్ మోహన్ రెడ్డిగారూ.?