వైఎస్ జగన్ మనసులో మూడు రాజధానుల ఆలోచన రాత్రికి రాత్రి పుట్టింది కాదు. దాని వెనుక ఏళ్ళ తరబడి నడిచిన తతంగమే ఉంది. కానీ జగన్ ఏనాడూ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అంతా అంతర్గతంగా జరిగిపోయింది. ఈ పథక రచన వైసీపీలో అప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న బడా నేతలకు కూడ తెలియదంటే వైఎస్ జగన్ ఎంత గొప్యత పాటించారో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక లక్ష కోట్లతో అమరావతి నగరాన్ని నిర్మిస్తానని అంటూ ఏకంగా 32 వేల ఎకరాలు సేకరించి నిర్మాణం మొదలుపెట్టారు.
ఇదే అక్టోబర్ 22న 2015న సీమాంధ్ర ప్రజల కలల రాజధాని అని పేరు పెట్టి అమరావతికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మోదీ పవిత్ర నదీ జలాలను, పుణ్యక్షేత్రాల మట్టిని తీసుకురాగా బాబుగారు ఛాపర్ ఎక్కి మరీ అమరావతి మీద ఆ మట్టీ నీళ్లు చల్లారు. అనంతరం నిర్మాణ పనులు మొదలయ్యాయి. అక్కడే బాబుగారు తాత్కాలిక భవనాలు అంటూ పెద్ద బండ వేశారు. వందల కోట్లు పెట్టి కట్టే భవనాలు తాత్కాలికమేనా, తర్వాత వాటిని కూల్చేస్తారా అంటూ జనం నొరెళ్ళ బెట్టారు.
ఇక ఆ తర్వాత సింగపూర్ నమూనాలతో బాబుగారి విన్యాసాలు చెప్పానలివికావు. టీడీపీ ప్రభుత్వం 35,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు టెండర్లను ఖరారు చేసి 10,000 కోట్ల విలువైన పనులు ముగించారు. అప్పటికే లక్ష కోట్ల నగరం, 32,000 ఎకరాలు.. జరిగేపనేనా అనే అనుమానం జనంలో మొదలైపోయింది. ఆ అనుమానాన్నే నిజం చేస్తూ వైఎస్ జగన్ సీఎం హోదాలో గత ఏడాది డిసెంబర్ 17న మూడు రాజధానులను ప్రకటించి అమరావతి కలను పూర్తిగా చెదరగొట్టారు. జగన్ ప్రకటన విన్న జనం అమరావతిని రాజధానిగా ఉంచమంటూ ఈ కొత్త నిర్ణయం ఏమిటి అంటూ కిందా మీదా అయిపోయారు.
నిజానికి జగన్ తాను సీఎం అయితే అమరావతి ఉండబోయేది లేదని చంద్రబాబు అమరావతికి శంఖుస్థాపన చేసే రోజునే హింట్ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతగా జగన్ కు కూడ ఆహ్వానం వెళ్ళింది. నిజంగా అమరావతి పట్ల కమిట్మెంట్ అనేది ఉండి ఉంటే ఆనాడే జగన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారు. కానీ హాజరుకాలేదు. అంటే అక్కడే అమరావతి అనేది జగన్ లెక్కల్లోనే లేదని జనం అర్థం చేసుకుని ఉండాలి. కానీ చేసుకోలేదు. అన్నేళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం జగన్ మనసులోని ఆలోచనను పసిగట్టలేక కేవలం నోటి మాట మీదే ముందుకెళ్ళారు. చివరికి ఈరోజు కలలన్నీ చెదిరి భూములిచ్చిన రైతులు రోడ్డేక్కి దీక్షలు చేస్తూ నానా తంటాలు పడుతున్నారు.