కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళలేని దత్తపుత్రుడెవరు.?

Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏ రాజకీయ వ్యూహంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేస్తున్నారోగానీ, అవి బూమరాంగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో జనంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. గత కొంతకాలంగా పబ్లిక్ మీటింగ్స్‌లో జనసేనాని సరిగ్గా ప్రసంగించలేకపోతున్నారు.. కేవలం స్క్రిప్ట్ చదవడంతోనే సరిపెడుతున్నారు.

అయితే, ఆ స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు.? అన్నదానిపై వైసీపీలోనే ఒకింత అసహనం పెరిగిపోతోంది. నిన్నటికి నిన్న ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తే, అందుకోసం ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున భారీ ఏర్పాట్లు జరిగినాగానీ, జనం ఆ సభలో కాస్సేపు కూడా కూర్చోలేకపోయారు. ఇది విపక్షాలకు ఆయుధంగా మారింది.

కేవలం జనసేన మీద అర్థం పర్థం లేని విమర్శలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తున్నారనే చర్చ జన బాహుళ్యంలో పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టే ముఖ్యమంత్రి వ్యవహార శైలి కూడా కనిపిస్తోంది. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేనానిని ముఖ్యమంత్రి మరీ అంత సీరియస్‌గా తీసుకోవడాన్ని వైసీపీ శ్రేణులూ జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇదిలా వుంటే, జనసేన అధినేతను దత్త పుత్రుడంటూ తాజాగా ఇంకోసారి విమర్శించడంపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ దత్త పుత్రుడిగా అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జనసేన మద్దతుదారులు సీబీఐ దత్త పుత్రుడు జగన్.. అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు.

త్వరలో రాష్ట్రానికి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళనున్న జగన్ ఇందుకోసం కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ‘విదేశాలకు వెళ్ళేందుకు సీబీఐ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.. ఇప్పుడు చెప్పండి దత్త పుత్రుడెవరో..’ అంటూ ముఖ్యమంత్రి మీద సెటైర్లు పడుతున్నాయ్.