వైసీపీ అనుకూల మీడియా అంటే, అది ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుందన్నది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు హయాంలో టీడీపీ అనుకూల మీడియా ఏం చేసిందో, జగన్ హయాంలో వైసీపీ అనుకూల మీడియా కూడా అదే చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడివరకూ బాగానే వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నా చెప్పుకోవాల్సింది ఇదే. కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వేగంగా స్పందిస్తోందని చెప్పడం, అదే విషయాన్ని వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సబబు.? జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం బాధ్యత కేంద్రానిదే.
కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించి వుంటే, 2014 నుంచి 2019 వరకు చాలా ఎక్కువ సమయం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి. రాష్ట్రానికి ఇందులో పాత్ర చాలా చాలా తక్కువ. చంద్రబాబు అధికారంలో వున్నా, వైఎస్ జగన్ అధికారంలో వున్నా.. ప్రాజెక్టు ఘనత, వైఫల్యం.. రెండూ కేంద్రానివే అవుతాయి. జాతీయ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రంలోని అధికార పార్టీలు ప్రచారం చేసుకోవడం కేంద్రానికి నచ్చడంలేదు. అందుకే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో నానా రకాల రాజకీయాలూ చేస్తోంది.
చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి చేశారని బీజేపీ ఆరోపించింది, ఆరోపిస్తూనే వుంది. వైఎస్ జగన్ విషయంలోనూ అవే తరహా ఆరోపణలు బీజేపీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పోలవరం ఏటీఎంలా మారిపోయిందని చంద్రబాబు మీద ఎలాగైతే ప్రధాని మోడీ విమర్శలు చేశారో, వైఎస్ జగన్ మీద కూడా అలాంటి విమర్శలే చేయబోతున్నారు. ఈ విషయాల్ని గుర్తెరగాల్సిన వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి జాకీలేయడమేంటో.?