ఫ్యూచర్ లేని వైసీపీ టాప్ నేతలు వీళ్ళే ? జగన్ ఒక్క మాట చెబితే చాలు… కానీ!

రాష్ట్రంలో రాజధాని గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమరావతి రైతులే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా నష్టపోనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లిస్తాన‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. ఆదిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. వాటిని అధిగ‌మించి.. రాజ‌ధానిని విశాఖ‌లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు. ఈ క్రమంలో మ‌రి వైజాగ్‌లో రాజ‌కీయం అధికార పార్టీకి ఎలా ఉంటుంది ? ఇక్కడ ఇప్పటికే ఉన్న వైసీపీ నేత‌ల ప‌రిస్థితి ఏంటి ? అనే విష‌యాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మంత్రి అవంతి శ్రీనివాస‌రావు.. చ‌క్రం తిప్పేందుకు ఎంతో ప్రయ‌త్నిస్తున్నారు. కానీ అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యస‌భ‌స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా అన్నీతానై ఉత్తరాంధ్ర జిల్లాల్లో చ‌క్రం తిప్పారు. పార్టీ అధికారంలోకి రాక‌ముందు నుంచి కూడా ఆయ‌న విశాఖ‌లోనే మకాం వేశారు. ఇక్కడ త‌ను చెప్పిందే వేదం అనే రేంజ్‌లో పార్టీని ముందుకు న‌డిపించారు. ఫ‌లితంగా ఇక్కడ నాయ‌కులు అంటూ ఎవ‌రూ ప్రత్యేకంగా లేకుండా పోయారు. ఎంపీ ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు ఎదిగేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నా.. విజ‌య‌సాయిరెడ్డి హవాతో వారంతా డ‌మ్మీలుగానే ఉన్నారు.

ఇప్పుడు జగన్ పరిపాలనా రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తే ఇంకా అక్కడ అన్ని పనులు జగన్ అధీనంలోనే జరగాలి. అప్పుడు అక్కడి స్థానిక నాయకుల ప్రభావం ఇంకా తగ్గనుంది. పరిపాలనా కార్యాలయం అక్కడికి వస్తే అధికారుల ప్రభావం తగ్గనుంది. రాజధాని తరలింపు స్థానిక వైసీపీ నాయకుల అధిపత్యానికి అడ్డువేయనుంది. ఇంకా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వస్తుండటంతో విశాఖలోని స్థానిక వైసీపీ నాయకులకు ఇంకా భయం ఎక్కువైంది. జగన్ తీసుకున్న రాజధాని నిర్ణయం వల్ల బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ లా స్థానిక వైసీపీ నాయకుల రాజకీయ జీవితం మసకబారుతుంది.