Yoga Day 2021: నేడే ‘యోగా డే’..! ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలు

Yoga Day 2021: ‘యోగా’ను రోజువారీ దినచర్యగా భావిస్తున్నారు ప్రజలు. ప్రపంచం మొత్తం యోగా వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించింది. దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా.. యోగా మాత్రం అందరినీ ఒక్కటి  చేసింది. ఆరోగ్యానికి, బాహ్య శరీరానికి, మానసిక ప్రశాంతతకు యోగాను మించింది లేదు. ఇది గుర్తించే ఐక్యరాజ్యసమితి యోగాకు ప్రత్యేకంగా ఒక రోజును ప్రకటించింది. దీనిని భారత్ సిఫార్సు చేసింది. ఈక్రమంలో జూన్ 21న.. అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. నేడే.. ‘యోగా డే’. ప్రతిఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రపంచ దేశాల ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా వివిధ దేశాల్లో ఉదయం నుంచే బహిరంగంగా యోగాలు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.. యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.

ఈక్రమంలో ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్‌లోని ఇండియా కాన్సులేట్ జనరల్  యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ అలియాన్స్ దగ్గర యోగా కార్యక్రమం జరిగింది. ‘సోల్స్‌టైస్ అన్ థీమ్’ పేరుతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి 3000 మందికి పైగా హాజరయ్యారు. దీంతో యోగాకు అమెరికా వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం కల్పించారు.  

జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూలో CRPF జవాన్లు యోగా చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డర్ లో సైన్యం కూడా ప్రతిఏటా ఈ ప్రత్యేక రోజున యోగా చేసి అందరిలో స్ఫూర్తి నింపుతారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ లో కూడా యోగా కార్యక్రమం జరుగుతోంది. కాంప్లెక్స్ దగ్గర రైల్వే ఉద్యోగుల యోగాసనాలు వేస్తున్నారు.

 

నేడు యోగాకు ఆదరణ పెరిగింది. సామాన్యులు సైతం యోగాకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. దీంతో యోగాకి ఎంతో ప్రధాన్యం పెరిగింది. పైగా.. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో యోగాను తప్పనిసరి చేస్తున్నారు. యోగా కోసమే విదేశాల నుంచి ఎందరో భారత్ వస్తున్నారు. ఇక్కడ యోగా నేర్చుకుంటున్నారు. రుషికేష్ కేంద్రంగా చాలా యోగా సెంటర్లు ఉన్నాయి. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో యోగా క్లాసులు జరుగుతున్నాయి.