ఫిబ్రవరి మొదటి రోజే జేబుపై భారం.. గ్యాస్‌ నుంచి బ్యాంకుల వరకూ మార్పులు..!

జనవరి నెల ముగింపు దశకు చేరుకుంటుండగా, ఫిబ్రవరి నెల దేశవ్యాప్తంగా కీలక మార్పులతో స్వాగతం పలకబోతోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్న కొన్ని నిర్ణయాలు సామాన్యుల రోజువారీ ఖర్చులు, ప్రయాణాలు, బ్యాంకు పనులు, అలవాట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ప్రతి నెల మొదటి రోజున జరిగే మార్పులాగే, ఈసారి కూడా కొన్ని కీలక రంగాల్లో సవరణలు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.

మొదటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది వంటగ్యాస్ ధరలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న కొత్త LPG సిలిండర్ ధరలను ప్రకటించనున్నాయి. 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా లేదా యథాతథంగా ఉంటాయా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది. ఇదే సమయంలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరలు కూడా సవరించబడే అవకాశం ఉంది. గత నెలలో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గిన నేపథ్యంలో, ఈసారి కూడా వినియోగదారులు ఊరట ఆశిస్తున్నారు.

గ్యాస్ ధరలతో పాటు ఇంధన రంగంలో మరో కీలక అంశం విమాన ఇంధనం. ఫిబ్రవరి 1న ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలపై కూడా సవరణలు వెలువడనున్నాయి. ATF ధరల్లో మార్పు జరిగితే, విమాన ప్రయాణ టికెట్ ధరలపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. గత నెల ATF ధరలు తగ్గిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా అన్నది ప్రయాణికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే సమయంలో CNG, PNG ధరల్లోనూ మార్పులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫిబ్రవరి మొదటి రోజు మరో వర్గానికి మాత్రం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై అదనపు పన్నులు అమల్లోకి రానున్నాయి. తాజా నోటిఫికేషన్ల ప్రకారం, ఇప్పటికే ఉన్న GSTకు అదనంగా కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్ విధించే అవకాశం ఉంది. ఆరోగ్య, జాతీయ భద్రత కారణాల పేరుతో ఈ అదనపు పన్నులు విధించనుండటంతో, సిగరెట్లు, పాన్ మసాలా ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వాహనదారులకు సంబంధించిన మరో మార్పు FASTag వినియోగంలో చోటు చేసుకోనుంది. ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్ల కోసం FASTag జారీకి సంబంధించి KYC ధృవీకరణ విధానంలో సడలింపులు అమలులోకి వస్తున్నాయి. ఈ నిర్ణయం కొత్తగా FASTag తీసుకునే వారికి కొంత ఉపశమనం కలిగించేలా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక బ్యాంకింగ్ రంగంలో ఫిబ్రవరి నెల కొంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, వారపు సెలవులతో పాటు ప్రత్యేక సందర్భాల కారణంగా వచ్చే నెలలో సుమారు పది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి సందర్భాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే తేదీలు చూసుకుని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి, ఫిబ్రవరి నెల మొదటి రోజే సామాన్యుడి జేబు నుంచి అలవాట్ల వరకూ అనేక మార్పులు తీసుకురాబోతోంది. అందుకే కొత్త నెలలోకి అడుగుపెట్టే ముందు ఈ మార్పులపై అవగాహన ఉండటం అవసరమని నిపుణులు చెబుతున్నారు.