అభిషేక్ తుఫాన్ షో.. ఫిలిప్స్ పోరాటం వృథా.. తొలి టీ20లో కివీస్‌పై భారత్ ఘన విజయం..!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ప్యాక్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆధిపత్యం చాటిన భారత్.. భారీ స్కోర్‌తో కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన టీమిండియా, చివరి వరకు అదే జోరు కొనసాగించి తొలి పోరులో స్పష్టమైన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కివీస్ బౌలర్లపై దాడి మొదలుపెట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన అసాధారణ ఫామ్‌ను చాటాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు బాదుతూ స్టేడియాన్ని షేక్ చేశాడు. ఎనిమిది భారీ సిక్సులు, ఐదు ఫోర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ త్వరగా పెవిలియన్ చేరినా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివర్లో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, రాబిన్సన్‌తో పాటు కీలక బ్యాటర్ రచిన రవీంద్ర తక్కువ పరుగులకే వెనుదిరగడంతో కివీస్ ఒత్తిడిలో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఒంటరిగా పోరాడాడు. కేవలం 40 బంతుల్లో 78 పరుగులు చేస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మార్క్ చాంప్‌మన్ కూడా కొంతసేపు అతనికి అండగా నిలిచాడు.

అయితే ఫిలిప్స్ ఔటైన వెంటనే మ్యాచ్ భారత్ వైపే తిరిగింది. చివర్లో డారెల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ ప్రయత్నించినా అప్పటికే లక్ష్యం దూరమైంది. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 190 పరుగులకే పరిమితమై 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్‌ను కట్టడి చేశారు. ఈ విజయంతో టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతంగా ఆరంభించి, ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపింది.