కరోనా వైరస్ సెకెండ్ స్ట్రెయిన్ రూపంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ దొరికింది. కానీ, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహకరించాల్సిందేనంటూ హైకోర్టు, ప్రభుత్వానికి తేల్చి చెప్పడంతో అధికార వైసీపీ ఇరకాటంలో పడింది. కరోనా న్యూ స్ట్రెయిన్ సహా పలు అంశాలపై అధికారుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించాలనీ, ఆ చర్చల సారాంశాన్ని తమ ముందు వుంచాలనీ న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. అయితే, కరోనా వైరస్ కంటే.. స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికార వైసీపీకి పెద్ద సమస్యగా మారినట్లు.. ఇటీవలి పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. ‘మేమేమీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి భయపడటంలేదు..’ అంటూనే, ఆయన వుండగా స్థానిక ఎన్నికల్ని జరిపేది లేదని అధికార పార్టీ నేతలు..
అందునా మంత్రులు తెగేసి చెబుతున్నారు. ఇంతకు ముందెన్నడూ, ఏ రాష్ట్రంలోనూ కన్పించని భిన్నమైన పరిస్థితి ఇది. తెరవెనుక టీడీపీ అందిస్తున్న స్క్రీన్‌ప్లే ప్రకారమే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నడుస్తున్నారన్నది వైసీపీ ఆరోపణ. అది నిజమా.? కాదా.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ వాస్తవ పరిస్థితి ఏంటి.? అన్నదే ముఖ్యం. కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఆ లెక్కన, స్థానిక ఎన్నికలకు పెద్దగా ఇబ్బంది వుండకపోవచ్చు. అయితే, కరోనా న్యూ స్ట్రెయిన్ భయాలు పెరగడంతో, అది అధికార పార్టీకి స్థానిక ఎన్నికల పరంగా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇంకోపక్క, అధికార పార్టీ చేపడుతున్న రాజకీయ కార్యక్రమాలకీ, ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేపడుతున్న కార్యక్రమాలకీ కరోనా వైరస్ ఇబ్బందికరం కానప్పుడు, స్థానిక ఎన్నికలకు మాత్రం ఎందుకు అది ఇబ్బంది అవుతుంది.? అని రేప్పొద్దున్న ధర్మ సందేహం న్యాయస్థానానికి రావొచ్చు. అదే జరిగితే, న్యాయస్థానం ఆ తర్వాత ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. ఈ నెల 29న ఈ వ్యవహారాలపై మరింత స్పష్టత రాబోతోంది. ప్రస్తుతానికైతే ఎస్‌ఈసీ వర్సెస్ ఏపీ సర్కార్ ఎపిసోడ్‌లో.. తూకం సమానంగానే కనిపిస్తోంది.. వాదనల పరంగా. మొగ్గు కాస్సేపు అటు వైపు, కాస్సేపు ఇటువైపు అన్నట్టుంది పరిస్థితి.