Y S Jagan : ఆ రేసులో వైఎస్ జగన్ వెనుకబడిపోతున్నారా.?

Y S Jagan : 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా.? అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశముందా.? ఏమో, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ఇంతకీ, వచ్చే ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా సంసిద్ధమవుతోంది.? ఈ దిశగా వైఎస్ జగన్ ఏమైనా ఆలోచిస్తున్నారా.? లేదా.?

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షణం తీరిక లేకుండా వున్నారు. విపక్షాలు చేసే విమర్శలు ఓ వైపు, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఇంకో వైపు.. వీటికి అదనంగా ఉద్యోగుల ఆందోళనలు సహా అనేకానేక సమస్యలు వెరసి, తన రాజకీయ జీవితంలోనే అత్యంత కష్టతరమైన ఫేజ్‌లో వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

పాలన ఎలా వుంది.? అన్నదానిపై నిర్ణయించాల్సింది ప్రజలు. అలా నిర్ణయించాలంటే, ఎన్నికలు రావాలి. ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయాలి. పరిపాలన మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, పార్టీ వ్యవహారాల్ని వైఎస్ జగన్ పట్టించుకోవడంలేదన్న విమర్శ వుంది.

పార్టీలో కీలక నాయకులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడంలేదన్న విమర్శ ఈనాటిది కాదు. ఇదిలా వుంటే, రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్రంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపడలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీయార్ అలా కాదు.. వీలు చిక్కినప్పుడల్లా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

ఈ విషయంలో మాత్రం కేసీయార్‌తో పోల్చితే వైఎస్ జగన్ చాలా వెనకబడిపోయారనే చెప్పాలి. అయితే, కేంద్రంలో బీజేపీ బలం తగ్గిందన్న సంకేతం అందితే, వైఎస్ జగన్ రాజకీయంగా చెలరేగిపోవడం ఖాయమన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఆ రోజెంతో దూరంలో లేదని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.