వైసీపీ మాజీ మంత్రుల్లో టిక్కెట్ల టెన్షన్.!

YCP Ex Ministers : 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ఇప్పటినుంచే 2024 ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. అధికారంలో వున్న పార్టీలకు ఇదే వెసులుబాటు. కింది స్థాయి పరిస్థితుల్ని అంచనా వేయడం, పాలనా పరంగా తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు.. తద్వారా ప్రజల్లో మరింత మంచి పేరు తెచ్చుకునేందుకు ఆస్కారం కలుగుతుంది.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందికి టిక్కెట్లు కష్టమేనన్న ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కింది స్థాయిలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వే ప్రకారం, దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని తేలిందటూ ప్రచారం తెరపైకొచ్చింది.

‘పనితీరు మెరుగుపరచుకోకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదు..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో ఇటీవల తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క, మంత్రులుగా పని చేసిన, చేస్తున్నవారిలోనూ కొందరికి టిక్కెట్లు దక్కకపోవచ్చంటూ వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం.

కొందరు వైసీపీ ముఖ్య నేతలు, స్వచ్ఛందంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారనేది తాజాగా వినిపిస్తోన్న పొలిటికల్ గాసిప్స్ సారాంశం. అలా ముందే చేతులెత్తేసిన నేతల్లో, అగ్రెసివ్ పొలిటీషియన్‌గా పేరొందిన ఓ మాజీ మంత్రి కూడా వున్నారట. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ మాజీ మంత్రి కూడా రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ, ఈ ప్రచారాల్లో నిజమెంత.?