Vangaveeti : త్వరలో, అతి త్వరలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ మంత్రి కాబోతున్నారట. అయితే, అది వైసీపీ హయాంలోనా.? టీడీపీ హయాంలోనా.? అన్నదే సస్పెన్స్. మంత్రి కొడాలి నాని ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తోంటే, వంగవీటి రాధకి ఎమ్మెల్సీ పదవి, దాంతోపాటే మంత్రి పదవీ వచ్చేలా వున్నాయి.. అదీ వైఎస్ జగన్ హయాంలోనే.
లేకపోతే, ఇలా వంగవీటి రాధ తనకు ప్రాణ హాని వుందని చెప్పడమేంటి, ఆ విషయాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, వంగవీటికి భద్రత కల్పించడమేంటి.? రాజకీయాల్లో ఈక్వేషన్లు ఇలాగే మారిపోతాయ్. త్వరలో, అతి త్వరలో వంగవీటి రాధ మంత్రి కాబోతున్నారంటూ బెజవాడ రాజకీయాల్లో ఘాటైన చర్చ జరుగుతోంది.
కాగా, ‘టీడీపీలోనే కొనసాగితే మంత్రి పదవి వస్తుంది.. లేదంటే, రాజకీయంగా అడ్రస్ గల్లంతవుతుంది..’ అంటూ వంగవీటి రాధ గురించి టీడీపీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతోంది. అంటే, టీడీపీ నుంచి వంగవీటి రాధ జారిపోయినట్లే భావించాలేమో.
మరోపక్క, వంగవీటి రాధ, జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయమై ఇంతవరకు వంగవీటి రాధ ఎక్కడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాను టీడీపీలోనే వున్నట్టుగానీ, వైసీపీలోకి వెళతాననిగానీ, జనసైన వైపు చూస్తున్నట్టుగానీ.. వీటిల్లో ఏ ఒక్క విషయమ్మీదా వంగవీటి రాధ నుంచి స్పష్టత లేదు.
‘నా తమ్ముడు వంగవీటి రాధ..’ అంటూ మంత్రి కొడాలి నాని పదే పదే చెబుతుండడం చూస్తోంటే, వంగవీటి వైసీపీ వైపుకు వెళ్ళేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి పదవి అంటారా.? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.