ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ నుంచే పోటీ చేస్తారా.?

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొన్నాళ్ళ క్రితం వైసీపీలో చేరిన విషయం విదితమే. పార్టీ మారాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన వల్లభనేని వంశీ, రాజీనామా చేయకుండా.. తన ఎమ్మెల్యే పదవి పోకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి.. మంత్రి పదవులు కూడా ఇచ్చారు పార్టీ ఫిరాయించిన నేతలకి.

అయితే, వైసీపీ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నా, మంత్రి పదవులైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. ఇంకోపక్క, వైపీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో అంతర్గతంగా కుమ్మలాటలూ ఎక్కువయ్యాయి.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వంశీ రాకని, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు బుజ్జగించారు కూడా. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. పంచాయితీ ముఖ్యమంత్రి వరకూ వెళ్ళింది. అయితే, తనకంటూ సొంత ఇమేజ్ వుందనీ, ప్రజా బలం వుందనీ, ఎవరి మీదనో ఆధారపడి తాను రాజకీయాలు చేయడంలేదని వల్లభనేని వంశీ చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.? అనడిగితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై వైసీపీలోకి వచ్చాననీ, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో మీరే చూస్తారు కదా.. అంటూ వల్లభనేని వంశీ సమాధానమివ్వడం గమనార్హం.

కాగా, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వల్లభనేని ‘ప్రత్యామ్నాయం’ వైపు సమాలోచనలు చేస్తున్నారన్నది గన్నవరం నియోజకవర్గంలో జరుగుతోన్న చర్చ. టీడీపీలోకి తిరిగి వెళ్ళకపోవచ్చుగానీ, జనసే లేదా బీజేపీల్లో ఏదో ఒకపార్టీలోకి ఆయన దూకేస్తారని అంటున్నారు.