YCP Leaders : బలిసి కొట్టుకోవడమేంటి మహాప్రభో.!

YCP Leaders : సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆదాయం వస్తోన్న మాట వాస్తవం. మెజార్టీ వసూళ్ళు ఏపీ నుంచే వస్తున్నాయి గనుక, రాష్ట్రంలో సినిమా షూటింగులు చేయాలనీ, నిర్మాణనంతర కార్యకలాపాలు ఏపీలోనూ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంలో తప్పేమీ లేదు.

సినిమా పరిశ్రమకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ మధ్య చర్చలు జరగాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినీ పరిశ్రమ వర్ధిల్లాలి. ఆంధ్ర సినిమా, తెలంగాణ సినిమా.. అన్న తేడాల్లేకుండా తెలుగు సినిమా, జాతీయ స్థాయిలో.. ప్రపంచ స్థాయిలో వర్ధిల్లాలి. ఆ దిశగా రెండు తెలుగు రాష్ట్రాలూ, సినీ పరిశ్రమకి సహకరించాలి.

కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ.. తెలుగు సినీ పరిశ్రమకీ గ్యాప్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ గ్యాప్ పెంచేందుకు వైసీపీ నేతలు కొందరు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ లిస్టులోకి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ‘సినీ పరిశ్రమకు చెందినవారు బలిసి కొట్టుకుంటున్నారు..’ అంటూ నల్లపురెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు కావివి, వివాదాస్పద వ్యాఖ్యలు. అత్యంత అహంకారపూరితమైన, జుగుప్సాకరమైన విమర్శలివి.

వైసీపీలో చాలామంది సినీ ప్రముఖులున్నారు. మోహన్ బాబు, అలీ తదితరులే కాదు, రోజా వంటివారూ వున్నారు. చట్ట సభలకు సైతం సినీ ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. అలాంటివాళ్ళను తమ పార్టీలో పెట్టుకుని, ఎవర్ని ఉద్దేశించి నల్లపురెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు.?

ఓ వైపు పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.. ఇరు వర్గాల మధ్య పెరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా. ఇంతలో ఆ గ్యాప్ మరింత పెంచేందుకు నల్లపురెడ్డి లాంటోళ్ళు ప్రయత్నిస్తున్నారన్నమాట.