RGV : సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసి, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ హంగామా చేసి.. ఎలాగైతేనేం, ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇంతకీ, ఈ భేటీలో ఏం తేలింది.? ఏమీ తేలలేదు. వర్మ చెప్పాలనుకున్నది చెప్పారు, పేర్ని నాని వినాలనుకున్నది విన్నారు.
వ్యక్తులకు సంబంధించిన అంశం కాదిది. ఎవరైనా చర్చలకు రావొచ్చు, వారి సమస్యలను వినిపించొచ్చు.. అంటూ మంత్రి పేర్ని నాని, ఆర్జీవీతో సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. ‘నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి..’ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు పేర్ని నానితో భేటీ అనంతరం.
నిజానికి, సినీ పరిశ్రమకు వున్న అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకీ మధ్య గ్యాప్ పూడ్చాల్సింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. టిక్కెట్ ధరల నియంత్రణ సహా అనేక అంశాలు అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారన్నది ఓపెన్ సీక్రెట్.
సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు అందాయి. అంతకు ముందు వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ శాఖని చూసుకుంటున్నారు. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి హేమాహేమీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు జరిపినా.. పరిశ్రమ సమస్యలకు ఓ పరిష్కార మార్గమైతే దొరకలేదు.
అలాంటిది, ఆర్జీవీ రంగంలోకి దిగి మంత్రి పేర్ని నానితో చర్చించేస్తే సమస్యలు, వివాదాలు పరిష్కారమైపోతాయా.? ఆర్జీవీకి మీడియా అనవసరపు హైప్ ఇచ్చిందంతే. కోవిడ్ నేపథ్యంలో సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ వచ్చేసింది. ఇప్పుడిక సినిమాల గురించి, సినిమా సమస్యల గురించి మాట్లాడుకోవడమే దండగ.