సంక్షేమ పథకాలపై పవన్ కళ్యాణ్ వెటకారం వెనుక.!

సంక్షేమం, అభివృద్ధి.. రెండు పడవల మీద ఏ ప్రభుత్వమైనా ప్రయాణం చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. కొత్త రాష్ట్రం, సరైన రాజధాని లేని రాష్ట్రం కావడంతో.. ప్రజల్లోకి నగదుని సంక్షేమ పథకాల రూపంలో తీసుకెళ్ళడం ద్వారా.. కొంతమేర ప్రజలకు వెన్నుదన్నుగా వుండాలన్నది జగన్ సర్కారు ఆలోచన.

మరి, అభివృద్ధి సంగతేంటి.? నిజమే, అభివృద్ధి దిశగా రాష్ట్రం సరైన విధంగా ముందడుగు వేయలేకపోతోంది. దానికి కారణాలు చాలానే వున్నాయి. అందులో అతి ముఖ్యమైనది కేంద్రం సరైన రీతిలో సహకరించకపోవడం. పోనీ, కేంద్రాన్ని నిలదీసే విషయంలో విపక్షాలు సహకరిస్తున్నాయా.? అంటే అదీ లేదు.

రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ నడుస్తోంది. వైసీపీ సైతం, ఆ క్రీడలో భాగమే. చంద్రబాబు హయాం నుంచీ జరుగుతున్న వ్యవహారమే ఇది. సంక్షేమ పథకాలు ఇరవై మందికో పాతిక మందికో అందుతున్నాయ్.. మిగతా డెబ్భయ్ ఐదు, ఎనభై శాతం మంది ప్రజల మాటేమిటి.? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రశ్నించారు.

నిజమే, పవన్ ప్రశ్నల్లో పస వుంది. ఒకరి కడుపు కొట్టి, ఇంకొకరికి సంక్షేమ ఫలాలు అందిస్తే.. అది ఇబ్బందికరమే. కానీ, పేదవాడు పైకి రావాలంటే.. తప్పదు, ప్రభుత్వాలు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సిందే.

కోవిడ్ నేపథ్యంలో అభివృద్ధి గురించిన ఆలోచన తగ్గిపోయింది. అభివృద్ధికి తగిన సానుకూల పరిస్థితులూ కనిపించడంలేదు. వాస్తవానికి, ప్రభుత్వానికి అండగా జనసేన వుండి వుంటే, రాష్ట్రంలో పరిస్థితులు ఇంకోలా వుండేవి. నిర్మాణాత్మకమైన విపక్షంగా వ్యవహరిస్తామని చెప్పిన పవన్ మాట తప్పుతున్నారు.

చంద్రబాబు ట్రాప్‌లో పడి జనసేన అధినేత తన విశ్వసనీయతను కోల్పోతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.