Janasainiks : జనసైనికులు మాత్రమేనా.? వాళ్ళు మారరా.?

Janasainiks : సోషల్ మీడియా అంటేనే బూతు.. అన్నట్టుగా మారిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో రాజకీయం ఎలా వున్నా, తెలుగునాట మాత్రం రాజకీయం అత్యంత జుగుప్సాకరం. నాయకులూ అలాగే వున్నారు, వారిని ఫాలో అయ్యే అభిమానులదీ అదే పరిస్థితి. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా విభాగాల్ని పెట్టి, వాటి ద్వారా బూతుని ప్రోత్సహిస్తున్న వైనం అత్యంత జుగుప్సాకరం.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిదీ ఒకటే తంతు. బూతులతో విరుచుకుపడటం, చంపేస్తామని బెదిరించడం.. సోషల్ మీడియాలో సర్వసాధారణమైపోయింది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టింగులకు రెచ్చిపోయి, కొందరు భౌతిక దాడులకూ పాల్పడుతున్న ఉదంతాలున్నాయి.

జనసేన మద్దతుదారుడైన ఫణి (కన్నాభాయ్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ నడుపుతున్నాడు) అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిన్నపాటి కుదుపు. జనసేన సోషల్ మీడియా విభాగంలో అయితే అది ఓ ప్రకంపనే. జనసేన పార్టీ, ఈ అంశంతో తమకు సంబంధం లేదంటూనే, జనసైనికులు ఎలా వ్యవహరించాలో సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో తగ్గడంలేదు. అత్యంత జుగుప్సాకరంగా జనసేన మీదా, టీడీపీ మీదా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు వైసీపీ మద్దతుదారులు. మరి, అలాంటివారిపై ‘అరెస్టు’ లాంటి చర్యలు వుండవా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది.

గతంలో న్యాయమూర్తులపై బెదిరింపులకు దిగిన కొందరు వైసీపీ మద్దతుదారులపై చర్యలకు పోలీసు యంత్రాంగం ముందుకు రాకపోవడంతో, హైకోర్టు ఏకంగా సీబీఐని రంగంలోకి దించాల్సి వచ్చింది. పలువురి అరెస్టు కూడా జరిగింది. ఏదిఏమైనా, సోషల్ మీడియాని అదుపు చేయడం అంత తేలిక కాదు. పైగా, ఇప్పుడున్న రాజకీయాల్లో అసలే సాధ్యం కాదేమో.!