హిందూ దేవాలయాలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయ్.?

ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ హిందూ దేవాలయాలపై దాడులు షురూ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పద్మనాభస్వామి ఆలయానికి చెందిన విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేయడం పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో ఎక్కడ ఓ చోట ఇలాంటి ఘటన జరుగుతూనే వుంది. ఒక ఘటన జరిగితే.. అది వేరే లెక్క. కానీ, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ, బీజేపీలే ఈ దాడులకు బాధ్యత వహించాలన్నది అధికార పార్టీ చెబుతున్న మాట. కానీ, అధికారపక్షంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.. దేవలయాలకు వైఎస్ జగన్ హయాంలో రక్షణ లేకుండా పోయిందని. అంతర్వేది రధం దగ్ధం ఘటన అప్పట్లో పెను దుమారం రేపింది.

అప్పటికీ ఇప్పటికీ ఈ కేసులో దోషులెవరో తేలలేదు. రామతీర్థం కొండపై ఓ దేవాలయంలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఆ ఘటనలో వాస్తవాలు బయటకు రాలేదు. పిఠాపురంలోని ఓ దేవాలయం సహా రాష్ట్రంలో చాలా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. నిజానికి, ప్రభుత్వం అన్ని దేవాలయాల దగ్గరా భద్రతను పెట్టలేదు. ఎందుకంటే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చిన్నా చితకా దేవాలయాలున్నాయి మరి. భక్తుల సెంటిమెంట్లు దెబ్బతింటాయ్ దేవాలయాలపై దాడులు జరిగితే. కానీ, ప్రతి విషయాన్నీ ప్రభుత్వానికి అండగట్టడం సరైన పని కాదు. అదే సమయంలో, ప్రభుత్వం కూడా దోషుల్ని శిక్షిస్తే.. ఇలాంటి ఘటనలు జరగవు. మత మార్పిడులు గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడవి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడుల వల్లనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నది ఇంకో వాదన. ప్రభుత్వం దోషుల్ని కఠినంగా శిక్షించగలిగితే, విపక్షాల నుంచి ఈ స్థాయిలో విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి రాదు.