ఏపీ సీఎం ఢిల్లీకి ఎప్పుడూ వెళ్లనట్టుగా ఇప్పుడే కొత్తగా వెళ్తున్నట్టుగా జగన్ ఢిల్లీ పర్యటన మీదనే తెగ వార్తలు వస్తున్నాయి. ఆయన తరుచుగా ఢిల్లీ వెళ్తూనే ఉన్నా.. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నా.. ఎందుకని ఈసారి పర్యటనకు ఇంత హైప్ వచ్చింది.
ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో సమస్యలు అలా ఉన్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణతోనూ ప్రస్తుతం ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు లేవు. వైసీపీ పార్టీ.. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సమయం కావడంతో రాజకీయంగా ఈ పర్యటనపై బాగా చర్చలు జరుగుతున్నాయి.
నిజానికి.. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతతోనే ఉంటోంది. వైసీపీ.. బీజేపీతో మంచి సంబంధాలు నెరుపుతోంది కాబట్టి.. వైసీపీ బీజేపీలో చేరుతోంది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ.. అది అంతా ఉత్తదే అని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు.
అయితే.. ఈసారి జగన్ ఢిల్లీ పర్యటనకు వేరే ఉద్దేశం ఉందట. ప్రధాని మోదీతో భేటీ అవుతోంది వేరే విషయాలు మాట్లాడటానికట. అందులో ఒకటి మండలి రద్దు చేసే అంశంపై ప్రధాని మోదీతో చర్చించడం అయితే.. ఇంకోటి తెలంగాణ సర్కారుపై ఫిర్యాదు చేయడం. దానితో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేశ్ చేసిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ప్రధానిని కోరడం.. వీటిపైనే ప్రధానితో మాట్లాడటానికి జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు.
అయితే.. ఇటీవలే సీఎం జగన్.. హోంమంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. అమిత్ షాను కలిసినప్పుడు కూడా జగన్.. ఇవే విషయాలు ప్రస్తావించారట. అయినా కూడా మరోసారి ప్రధానితో ఈ విషయాలపై చర్చించడానికి సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్తున్నారు. అంతే తప్ప.. ఎన్డీఏలో చేరడం కోసం కాదు.. అని వైసీపీ నేతలు చెబుతున్నట్టు తెలుస్తోంది.