Corona Virus: కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు..మహమ్మారి విజృంభణ అంతం కాలేదు..!

Corona Virus: కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది.2019 డిసెంబర్లో చైనాలో వెలుగుచూసిన ఈ అంటు వ్యాధి అతి తక్కువ సమయంలోనే ప్రపంచ దేశాలని గడగడలాడించింది. అప్పటి దాకా విచ్చల విడిగా తిరిగిన జనం ఒక్క సారిగా అలెర్ట్ అయ్యారు. పక్కన ఉన్న వ్యక్తిని తాకాలి అన్నా కూడా ఎంతో భయపడే పరిస్తితి ఏర్పడింది. కరోనా వివిధ రకాల వేరియంట్స్ రూపం లో విరుచుకుపడి…. తగ్గిపోయిన వెంటనే వాటిని మొదటి వేవ్, రెండవ వేవ్, మూడవ వేవ్ అని పేర్లు పెట్టుకునే పరిస్తితి ఏర్పడింది.

ఒక వేవ్ తగ్గిన వెంటనే కరోనా అంతం అవుతుంది అనే భావనతో చాలా మంది ఉన్నారు. ఈ మధ్యనే ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మూడవ వేవ్ ప్రళయం సృష్టించింది. రెండవ వేవ్ తో పోలిస్తే మూడవ వేవ్ లో ప్రాణ నష్టం తక్కువగా ఉండడం ఊరటనిచ్చింది. మన దేశం మీద కరోనా ప్రభావం తక్కువగా ఉన్నా కూడా, ప్రపంచ దేశాలు దీని వల్ల ఇబ్బంది పడ్డాయి. ఒమిక్రాన్ ప్రభావం కాస్త తగ్గు ముఖం పట్టిన తర్వాత ఆంక్షలు సడలిస్తు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి అందరూ కరోనా తగ్గిపోయిన తర్వాత, మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా, సానిటైజర్ వాడటం మానేశారు. ఇటువంటి పరిస్థితులలో డబ్లూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేసింది…. కరోనా ఇంకా అంతం అవ్వలేదు అని… దీని విజృంభణ ఇంకా ఆగిపోలేదు అని హెచ్చరించింది.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ నామ్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వాక్సిన్ పూర్తయితే ఈ సంవత్సరంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టవచ్చు అని తెలిపారు. కొన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని ఆయన తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్ దేశాలలో ప్రికాషనరి డోసులు ఇస్తున్నారు అని ఆయన చెప్పారు. అయితే ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే వాక్సినేషన్ పూర్తయింది ఆయన తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ ఆరు రెట్లు పెంచితే కానీ 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వదు అని తెలిపారు.

ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ ను ఆఫ్రిజెన్ బయోలాజిక్స్ మోడెర్నా సీక్వెన్స్‌ను ఉపయోగించి రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ అధనామ్‌తోపాటు డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు సందర్శించారు. డబ్ల్యూహెచ్‌ఓ, కొవాక్స్‌ సహకారంతో ఆఫ్రిజెన్‌.. ఈ ప్రాజెక్టు చేపడుతోంది. 2024 వ సంవత్సరంలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తయారుచేసిన వ్యాక్సిన్ తక్కువ ధరకు లభిస్తుందని దీనిని భద్రపరచడానికి కూడా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం ఉండదని అధనామ్ తెలిపారు. కరోనా పూర్తిగా అంతం అయ్యేవరకు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.