ఓహో అందుకేనా.. వైసీపీకి మాజీమంత్రి నారాయణ రాయబారం పంపింది

టీడీపీ హయాంలో మంత్రి నారాయణ హవా కొనసాగింది. చంద్రబాబు సర్కారు ప్రముఖంగా చేపట్టే అన్ని పనుల్లో ఆయన పాత్ర కనిపించేది. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారాయణ ఓటమిపాలయ్యారు. టీడీపీ పార్టీ కూడా ఓడిపోయింది. అంతే ఇక అప్పటి నుంచి మాజీ మంత్రి నారాయణ పత్తా లేకుండా పోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీడియాలో కనిపించని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు మీడియా మొత్తం కెమెరాలు వేసుకొని వెతికినా ఆయన జాడ దొరకడం లేదు. మరో వైపు టీడీపీ ఇటీవలే ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. దీంతో చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టారా లేక నారాయణ కావాలని టీడీపీకి దూరంగ ఉంటున్నారా అనే చర్చ సాగుతోంది.

టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణ అప్పటి రాజధాని అమరావతి వ్యవహారాలు చూశారు. అయితే అమరావతి కోసం జరిగిన భూ సేకరణపై వైసీపీ ప్రభుత్వం సిట్ నియమించింది. భూ సేకరణలో  చోటుచేసుకున్న అవకతవకలు జరిగాయని అందుకే నారాయణ సైలెంట్ అయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సిట్ తనని దోషిగా చూపించే ప్రయత్నం చేయొచ్చన్న అనుమానంతో ఉన్న మాజీమంత్రి నారాయణ వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంట. ఈమేరకు వైసీపీ పెద్దలతో వర్తమానం కూడా పంపారంట.

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేతతో వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారట. అందుకే ఎందుకు వచ్చిన గొడవలని నారాయణ సైలెంట్ అయ్యారంట. ఇది గమనించిన చంద్రబాబు ఆయన్ని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోలేదట. మరోవైపు టీడీపీ ఏ పిలుపును ఇచ్చినా మంత్రి నారాయణ వీటికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం తన విద్యాసంస్థల వ్యవహారాలు తప్ప మరే ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. అయితే మాజీమంత్రి నారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకునేది లేనిది అనేది తేలేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.