ఏదన్నా కేసులో అరెస్టయి, జైలుకు వెళితే ఏమవుతుంది.? రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామకృష్ణరాజు, అత్యంత వేగంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఉదంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో జైలుకు వెళ్ళడం అనేది అంత కష్టమైన వ్యవహారమేమీ కాదు రాజకీయ నాయకులకి. కానీ, ఓ పత్రికాధినేత.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళితే.. అంటూ పెద్ద ఉపన్యాసమే రాసుకున్నారు తన పత్రికలో.
జగన్ గనుక జైలుకు వెళ్ళాల్సి వస్తే, తన భార్య భారతిని ముఖ్యమంత్రి పదవిలో పెట్టాలని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారట. కానీ, బీజేపీ అధిష్టానం మరో ప్లాన్ రచించిందట. అదేంటంటే, భారతి కాకుండా షర్మిలను సీన్‌లోకి తీసుకురావాలన్నది ఆ ప్లాన్ అట. ఇలాంటి ఆలోచనలు పత్రికాధినేతలకు ఎలా వస్తాయో ఏమో. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ గతంలో అరెస్టయ్యారు.. 16 నెలలపాటు జైల్లో వున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, కుట్ర పన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే, ఆ తర్వాత వైసీపీకి సంబంధించి ఏం జరుగుతుందన్నది వైసీపీ అంతర్గత విషయం. వైఎస్ జగన్ సతీమణి రంగంలోకి దిగుతారా.? విజయమ్మ బాధ్యతలు తీసుకుంటారా.? షర్మిల తన అన్నకు అండగా నిలుస్తారా.? ఇవన్నీ వైసీపీకి సంబంధించిన విషయాలు.
అయినా, అరెస్ట్.. అన్న విషయమ్మీదనే భిన్నవాదనలున్నాయి. బీజేపీ – టీడీపీ కలిసి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరగలేదు. ఇప్పుడెలా జరుగుతుంది.? పైగా, పలు విషయాల్లో వైఎస్ జగన్, కేంద్రానికి మద్దతిస్తున్నారు. చాలా విషయాల్లో బీజేపీ – వైసీపీ వాదన ఒకేలా వుంది. ఆ రెండు పార్టీలూ టీడీపీ అధినేత చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. పైగా చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పదు.. లోకేష్ జైలుకు వెళ్ళక తప్పదంటూ బీజేపీ, వైసీపీ అంటున్నాయి. సో, సదరు పత్రికాధినేత చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళితే ఏం జరుగుతుందన్నదానిపై కథనాలు రాస్తే మంచిదేమో.