AP Govt Say To High Court : ‘మాది మూడు రాజధానుల విధానం..’ అని పదే పదే పాచిపోయిన పాటే పాడుతున్నారు అధికార వైసీపీ నేతలు. మంత్రులు సైతం ఇదే వాదనను వినిపిస్తున్నారు. ‘మూడు రాజధానుల్ని ఎవరూ ఆపలేరు..’ అని కూడా మంత్రులు స్టేట్మెంట్లు దంచేస్తున్నారు. పోనీ, మూడు రాజధానుల వ్యవహారంలో ఒక్క అడుగు అయినా ముందుకు పడిందా.? అంటే అదీ లేదు.
వైఎస్ జగన్ సర్కారు నిజంగానే మూడు రాజధానులకు కట్టుబడి వుంటే, శాసన సభలో కొత్త బిల్లుని పెట్టి, ఆమోదించి వుండేదే. అమరావతి విషయంలో కోర్టు తీర్పుల పట్ల అసహనం వ్యక్తం చేసిన వైసీపీ, శాసన సభలో ఈ అంశంపై పెద్ద చర్చే పెట్టిన సంగతి తెలిసిందే.
కానీ, హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతిలో పనులు తిరిగి ప్రారంభించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తూతూ మంత్రంగా కొన్ని పనులు పునఃప్రారంభించింది వైఎస్ జగన్ సర్కార్. అయితే, ఈ విషయమై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ సర్కారుకి చిత్తశుద్ధి లేదనీ, కోర్టు ఆదేశాల్ని ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆరోపిస్తూ అమరావతి కోసం భూములిచ్చిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ కేసు విచారించిన న్యాయస్థానం, అమరావతిలో పనులకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి, జగన్ సర్కారు కోర్టుకి ఏం సమాధానమిస్తుంది.? ఇదే ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చనీయాంశమవుతోంది.
వైఎస్ జగన్ సర్కారుకి అమరావతి పట్ల చిత్తశుద్ధి లేదు. అమరావతిని స్మశానంగా, ఎడారిగా వైసీపీ మంత్రులే అభివర్ణించారు. కానీ, కోర్టు యెదుట ఇలాంటి మాటలు చెప్పలేరు కదా.? కోర్టు ఆదేశాల్ని పాటించాల్సిందే. స్టేటస్ ఏంటన్న హైకోర్టు ప్రశ్నకు వైసీపీ సర్కారు ఇచ్చే సమాధానమేంటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.