తెలంగాణ‌-ఏపీ మ‌ధ్య‌ మ‌ళ్లీ వాట‌ర్ వార్?

తెలుగు రాష్ర్టాల మ‌ధ్య మ‌ళ్లీ వాట‌ర్ వార్ మొద‌లైందా? కృష్ణాజ‌లాల వివాదం మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిప్ట్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇరిగేష‌న్ శాఖ‌పై సోమ‌వారం రాత్రి వ‌ర‌కూ  రివ్యూచేసిన కేసీఆర్ తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు ఈ ప్రాజెక్ట్ భంగ‌క‌ర‌మ‌న్నారు. ఏపీ చేప‌డుతోన్న ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవ‌డానికి న్యాయ పోరాటం చేస్తామ‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఏపీ తీసుకున్న నిర్ణ‌యంపై కృష్ణా వాట‌ర్ బోర్డ్ లో ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. ఈప్రాజెక్ట్ ను అడ్డుకోవ‌డానికి రాజ‌కీయ పోరాటానికి సైతం దిగుతామ‌ని హెచ్చ‌రించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటిని లిప్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యం ప‌ద్ధ‌తిగా లేద‌న్నారు. ఇది విభ‌జ‌న చ‌ట్టానికి విరుద్దంగా ఉంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే ఉమ్మ‌డి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నీటి విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవ‌డం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్ట‌డం ఏపీ త‌ప్పిదాలుగా వ‌ర్ణించారు.

ఈ విష‌యంపై రాజీ లేని దోర‌ణితో ముందుకెళ్తామ‌ని తెలిపారు. ఏపీ-తెలంగాణ‌ల్లో కొత్త ప్రాజెక్ట్ లు నిర్మాణం చేప‌డితే అపెక్స్ క‌మిటీ అనుమ‌తి తీసుకోవాల‌ని ఏపీ పున‌ర్వ్య వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం స్ప‌ష్టంగా  పేర్కొంద‌ని కేసీఆర్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మూడు టీఎంసీల నీటిని లిప్ట్ చేసే విధంగా కొత్త ఎత్తిపోత‌ల ప‌థ‌కం చేప‌ట్ట‌డానికి నిర్ణ‌యించిన ఏ పీ ప్ర‌భుత్వం జీవో కూడా విడుద‌ల చేసింది. దీంతో మ‌ళ్లీ ఇరు రాష్ర్టాల మ‌ద్య వాట‌ర్ వార్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే రెండు రాష్ర్టాల అభివృద్ది కోసం ఇరువురు ముఖ్య‌మంత్రులు క‌లిసి మెల‌సి ప‌నిచేయాల‌నుకున్నారు. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకోవాల‌నుకున్నారు. కానీ ప్ర‌తీసారి రెండు రాష్ర్టాల మ‌ధ్య నీళ్ల పంపిణీ వివాదాన్ని రేపుతోంది.