గత ఎన్నికల్లో జగన్ ఫ్యాన్ గాలిని తట్టుకుని టీడీపీ గెలిచిన నియిజకవర్గాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం కూడ ఒకటి. కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం విజయవాడ రాజకీయాల్లో చాలా కీలలకమైనది. పార్టీ ఏదైనా ఇక్కడ కమ్మ వర్గానిదే హవా. అందుకే ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి కూడ లాంగ్ రన్ అనేది దొరకలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం, టీడీపీ ఇలా పలు పార్టీలు వంతుల లెక్కన గెలుస్తూ వస్తున్నాయి. కానీ చిత్రంగా తెలుగుదేశం మాత్రం వరుసగా రెండుసార్లు గెలిచి సత్తా చాటుకుంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే అయ్యారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం కాలంలో ఇలా వరుసగా రెండుసార్లు గెలిచిన పార్టీ తెలుగుదేశమే. అలాంటిది ప్రస్తుతం టీడీపీకి భవిష్యత్తులో ఇక్కడ చోటు ఉండదేమో అనేలా ఉంది పరిస్థితి.
అందుకు కారణం కూడ టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నారు విశ్లేషకులు. గద్దె రెండవసారి కూడ కట్టిన చోట దూకుడుగా ఉండాల్సిన ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయారు. అధికారం లేదు కాబట్టి ఏం చేయగలమని అనుకున్నారో ఏమో కానీ పెద్దగా ప్రజా జీవితంలోకి రావడంలేదట ఆయన. చిన్న పనుల నుండి పేద పనుల వరకు అన్నీ వైసీపీ నేతలే చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉండి కూడా లేనట్టే వ్యవహరిస్తున్నారు. ఇదే తరుణమని భావించిన వైసీపీ ఇంఛార్జ్ దూసుకుపోతున్నారట. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుంటున్నారట. పరిష్కారం చూపినా జనంలో కలియదిరుగుతున్నారని, గెలిపించిన ఎమ్మెల్యే మాత్రం కానరావట్లేదని అనుకుంటున్నారట స్థానికులు.
ఇది ఒక వైఫల్యమైతే టీడీపీ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కూడ క్యాష్ చేసుకోలేకున్నారు ఆయన. దుర్గగుడి ఫ్లైఓవర్, బందర్ రోడ్డు విస్తరణ ఇలా పెద్ద పెద్ద పనుల క్రెడిట్ తీసుకోవడంలో విఫలమవుతున్నారట. ఆ పనులు మొదలుపెట్టింది, 90 శాతం పూర్తిచేసింది తామేనని చెప్పుకోవడానికి కూడ జనంలోకి రావట్లేదట. మరోవైపు టీడీపీ కేశినేని నాని, మరొక నేత బుద్దా వెంకన్నలు ఆయా పనులను చేసింది తెలుగుదేశమేనని, తామేనని బాకాలు ఊదుకుని చెబుతుంటే ఎమ్మెల్యే మాత్రం ఇలా మౌనం వహిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు కూడ ఇది నచ్చట్లేదట. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడ దొరకవని చెప్పుకుంటున్నారట. అసలు బెజవాడలో టీడీపీకి ఇవే ఆఖరు రోజుల అవుతాయేమోనేని ఆందోళన చెందుతున్నారట.