వైసీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

‘చంద్రబాబు సతీమణిపై ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు..’ అంటూ వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ, చంద్రబాబు సతీమణిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ‘క్షమాపణ’ చెప్పారు.. అదీ ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో.

వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం అయితే జరిగిందిగానీ, ఆయన మీద అనర్హత వేటు పడలేదు. వైసీపీ నేతగానే చెలామణీ అవుతున్నారు వల్లభనేని వంశీ.

వల్లభనేని వంశీతోపాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చంద్రబాబు సతీమణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. తాము అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని మొదట పై నలుగురూ చెప్పుకొచ్చారు. అందులో ముగ్గురు ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి వున్నారు.

చిత్రమేంటంటే, పైన పేర్కొన్న నలుగురిలో ముగ్గురు వైసీపీ నేతలు. వల్లభనేని వంశీ మాత్రమే, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకుడు. వల్లభనేని వంశీ తాజాగా క్షమాపణ చెప్పడమంటే, వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చినట్లే లెక్క. చంద్రబాబు సతీమణిపై తామెవరం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదంటూ వైసీపీ కుండబద్దలుగొట్టేస్తున్న వేళ, తాను పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

ఒకటీ, వల్లభనేని వంశీ, వైసీపీకి షాక్ ఇచ్చారు. రెండు, ‘కమ్మ’ సామాజిక వర్గ పెద్దల ఆగ్రహానికి గురైన వల్లభనేని తెలివిగా, ఈ వివాదం నుంచి తప్పుకునేందుకు ప్రయత్నించారు. అంటే, దానర్థం.. టీడీపీ వైపు మళ్ళీ వల్లభనేని చూడబోతున్నారని అర్థం చేసుకోవాలా.?