ఈ రోజుల్లో గుండెపోటు అంటేనే సాధారణ కుటుంబాల్లో భయాందోళన నెలకుంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం పోతుందేమో అన్న ఆందోళన ఒకవైపు.. లక్షల్లో అయ్యే ఆసుపత్రి ఖర్చులు ఎలా భరించాలి అన్న టెన్షన్ మరోవైపు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బుల లేమి కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను ‘గోల్డెన్ అవర్’లోనే కోల్పోతున్న దృశ్యాలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంది.
ఇకపై గుండెపోటు వచ్చిన పేద, మధ్యతరగతి వ్యక్తి డబ్బుల కోసం ఆగి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చయ్యే అత్యంత కీలకమైన హార్ట్ అటాక్ ఇంజెక్షన్లను ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తగా మారింది.
ప్రభుత్వం ఉచితంగా అందించనున్న ఈ ఇంజెక్షన్లలో టెనెక్టెప్లేస్, స్ట్రెప్టోకైనేస్ వంటి అత్యంత ప్రభావవంతమైన క్లాట్-బస్టర్ మందులు ఉన్నాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఒక్కసారిగా గడ్డకట్టిన రక్తాన్ని కరిగించి.. మళ్లీ సాధారణ రక్తప్రవాహాన్ని ప్రారంభించే శక్తివంతమైన మందులివి. గుండెపోటు వచ్చిన తొలి 90 నిమిషాల కాలాన్నే వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఈ సమయంలోనే ఈ ఇంజెక్షన్ ఇస్తే గుండెకు కలిగే నష్టం గణనీయంగా తగ్గుతుంది, ప్రాణాంతక ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు భారీగా పెరుగుతాయి.
ఈ ఉచిత చికిత్సలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ మందులు కేవలం పెద్ద నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే లభ్యమయ్యేవి. పల్లెల్లో గుండెపోటు వచ్చిన రోగిని సిటీకి తరలించేలోపే విలువైన సమయం గడిచిపోయేది. దీనికి ముగింపు పలికేందుకే ప్రభుత్వం హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఈ విధానం ప్రకారం పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు హబ్‌లుగా ఉండి, జిల్లా ఆసుపత్రులు, స్థానిక హెల్త్ సెంటర్లు స్పోక్‌లుగా పనిచేస్తాయి. స్పోక్ కేంద్రాల్లోనే ప్రాథమిక అత్యవసర చికిత్సలు అందించి, అవసరమైతే రోగిని హబ్ ఆసుపత్రులకు తరలిస్తారు. దీంతో గ్రామాల్లో ఉన్నవారికి కూడా సకాలంలో ప్రాణరక్షణ చికిత్స అందే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: మీ ఇంట్లో ఇవి ఉన్నాయా..? ఇప్పుడే తీసేయండి.. లేదంటే అష్టదరిద్రం తలుపు తడుతుంది..!
ఆసుపత్రికి గుండెపోటు లక్షణాలతో రోగి వస్తే ఇకపై వైద్యం కూడా ఒక నిర్దిష్ట ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. వెంటనే ECG చేసి హార్ట్ అటాక్ నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ అయిన క్షణాల్లోనే ఉచితంగా క్లాట్-బస్టర్ ఇంజెక్షన్ ఇస్తారు. పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంటే ప్రాథమిక చికిత్స అనంతరం పెద్ద ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా వైద్య సిబ్బంది పనిచేయనున్నారు.
వైద్య నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఇంజెక్షన్లు గోల్డెన్ అవర్‌లో ఇస్తే మరణాల ముప్పు 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీకి దూరంగా ఉన్న పల్లెల్లో ఈ పథకం అమలు వల్ల వేలాది ప్రాణాలు కాపాడబడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవలి కాలంలో యువతలో కూడా గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సమాజానికి భరోసా కలిగించే అడుగుగా మారింది. డబ్బుల లేమితో ప్రాణాలు పోతున్నాయనే నిందలు ఇకపై రాకుండా చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం విజయవంతమైతే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా మోడల్‌ను అనుసరించే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
