మీ ఇంట్లో ఇవి ఉన్నాయా..? ఇప్పుడే తీసేయండి.. లేదంటే అష్టదరిద్రం తలుపు తడుతుంది..!

ఇల్లు అంటే కేవలం ఇటుకలు, ఇసుక, సిమెంట్ మాత్రమే కాదు.. అది కుటుంబానికి శాంతి, భద్రత, శుభశకునాల కేంద్రం. అలాంటి ఇంట్లో మనం తెలియక చేయించే చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయా అంటే వాస్తు నిపుణులు అవునని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో పగిలిన, విరిగిన లేదా పనికిరాని వస్తువులను అలాగే ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుందని వారు స్పష్టంగా చెబుతున్నారు.

చాలామంది ఇది చిన్న పగులు మాత్రమే, ఇది ఇంకా పని చేస్తోంది అంటూ విరిగిన అద్దాలు, పాడైన గాజు వస్తువులు, చిప్పలు పడిన ఫొటో ఫ్రేమ్‌లు, పనిచేయని గడియారాలను ఇళ్లలోనే ఉంచుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇవే ఇంట్లో క్రమంగా మానసిక ఒత్తిడిని, అనవసర కలహాలను, ఆర్థిక అడ్డంకులను తెచ్చిపెడతాయని నమ్మకం.

ముఖ్యంగా దేవతా విగ్రహం లేదా పూజా ఫొటో విరిగిపోతే దాన్ని ఇంట్లో ఉంచడం అశుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి విగ్రహాలను గౌరవంగా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయడం లేదా పవిత్రమైన చెట్టు కింద ఉంచడం శుభకరమని భావిస్తారు. ఇలాంటి వేళ ఎలా తొలగించాలి అనే సందేహంతో చాలామంది ఆలస్యం చేస్తారు. కానీ ఆలస్యం చేయడం ప్రతికూల శక్తిని ఇంట్లో నిలిపే ప్రమాదాన్ని పెంచుతుందన్నది నిపుణుల హెచ్చరిస్తున్నారు.

ఇక అద్దాలు, కిటికీ గాజులు, షోకేస్ గాజులు విరిగిన స్థితిలో ఉంటే వాటి ప్రభావం ఇంకాస్త తీవ్రంగా ఉంటుందట. వాస్తు ప్రకారం గాజు శుక్రగ్రహానికి ప్రతీక. శుక్రుడి అసమతుల్యత వల్ల సంబంధాల్లో అనుమానాలు, కుటుంబంలో విభేదాలు, ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతారు. అందుకే పగిలిన గాజును వెంటనే ఇంటి నుంచి బయటకు తీసేయాలని సూచిస్తారు.

ఇంకా ఇంట్లో పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, పాడైన ఫర్నిచర్, చక్రాలు గల వస్తువులు సరిగ్గా తిరగని స్థితిలో ఉంటే కూడా అవి జీవిత గమనాన్ని అడ్డుకుంటాయని వాస్తు నమ్మకం. ముఖ్యంగా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే కాలచక్రం నిలిచిపోతుందన్న భావన కూడా ఉంది. ఇది ఉద్యోగాల్లో స్టాగ్నేషన్, వ్యాపారాల్లో నష్టాలు, జీవితంలో అనిశ్చితికి సంకేతమని కొందరు నమ్ముతారు.

ఈ విషయాలన్నింటికీ శాస్త్రీయ ఆధారాలు ఖచ్చితంగా లేకపోయినా, ఇంటిని శుభ్రంగా, క్రమంగా, పనికిరాని వస్తువుల్లేని వాతావరణంలో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుందని నిపుణులూ ఒప్పుకునే నిజం. నెగెటివ్ ఎనర్జీ అన్న భావన ఎంతవరకు నమ్మకం అయినా, చెత్త, విరిగిన వస్తువులు ఇంట్లో లేకపోవడం ఆరోగ్యానికి, మనసుకు శుభప్రదమే. కాబట్టి ఇల్లు కేవలం నివాసం కాకుండా శుభశక్తికి కేంద్రంగా మారాలంటే.. ఈ రోజే ఇంట్లో ఓసారి చుట్టూ చూసి, పనికిరాని, విరిగిన వస్తువులకు శాశ్వతంగా ‘గుడ్‌బై’ చెప్పడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.