అధికాంలోకి వచ్చాక రెండేళ్ళలో సంక్షేమ పాలన అందించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తిరుగులేని మెజార్టీ ఇచ్చిన ప్రజలకు, సంక్షేమం కార్యక్రమాలతో ‘పండగ’ మాత్రమే వైఎస్ జగన్ చూపించారనుకుంటే అది పొరపాటే. ఆ సంక్షేమం వెనుక కొండంత అప్పు వుంది. కనీ వినీ ఎరుగని స్థాయిలో రాష్ట్రం అప్పు గడచిన రెండేళ్ళలో పెరిగింది. ఇకపై కొత్త అప్పులు పుట్టడం ఎలా.? అన్న దిశగా జగన్ సర్కార్ కిందా మీదా పడుతున్నమాట వాస్తవం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వచ్చి పడింది. తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రాలూ అప్పులు చేయక తప్పలేదు. కానీ, వాటికి ఆర్థిక వనరులున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదు.
ఇంకోపక్క, రెండేళ్ళ పాలన పూర్తవడంతో, పదవుల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో ఒత్తడి తీసుకురావడం షురూ చేస్తారు. రెండున్నరేళ్ళకు మంత్రి వర్గంలో పెను మార్పులుంటాయని వైఎస్ జగన్, మొదట్లోనే స్పష్టం చేసిన దరిమిలా, ఆ కార్యక్రమం షురూ అయితే, అసంతృప్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.పదవులను అనుభవిస్తున్న నాయకులు, పదవుల్లేకుండా వుండగలరా.? పార్టీ ఫిరాయింపులు మొదలౌతాయ్. సరైన సమయం కోసం టీడీపీతోపాటు బీజేపీ, జనసేన కూడా ఎదురుచూస్తున్నాయి. ఓ వైపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థిని గాడిలో పెట్టాల్సి వుండడం.. ఇంకోపక్క పార్టీలో పుట్టబోయే ప్రకంపనలు.. వీటన్నటినీ డీల్ చేయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అయితే, వైసీపీ శ్రేణులు మాత్రం, వైఎస్ జగన్.. అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాల్న పక్కగా అమలు చేస్తున్న వైఎస్ జగన్ విషయంలో ప్రజలకు రెండో ఆలోచనే లేదన్నది వైసీపీ నేతల భావన. కానీ, రాజకీయాల్లో ఎప్పుడూ ఈక్వేషన్స్ ఒకేలా వుండవ్. మారిపోతుంటాయ్. రాజధాని సహా అనేక సవాళ్ళున్నాయి వైఎస్ జగన్ ముందర. మరి, జగన్ ఆ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు.? వేచి చూడాల్సిందే.