జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తే ఎలా.? ఈ ప్రశ్న చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ తరచూ తెరపైకొస్తోంది. ఇందులోనూ నిజం లేకపోలేదు. ‘పోలవరం ప్రాజెక్టుని మేమే పూర్తి చేస్తాం..’ అని గతంలో చంద్రబాబు అండ్ టీమ్ చెప్పారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అండ్ టీమ్ చెబుతూ వుండడం చూస్తున్నాం.
కానీ, కేంద్రం నిధులు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది.? కేంద్రమే నిధులు ఇవ్వాలి.. కేంద్రమే ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుని నిర్మిస్తుందంతే. కాదు కాదు, ప్రాజెక్టుని కాంట్రాక్టర్లు నిర్మిస్తారు. మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది.?
దేశంలో ఏ ప్రాజెక్టుకీ లేని దుస్థితి పోలవరం ప్రాజెక్టుకి పట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తక్కువే.. కానీ, పునరావాసం ఖర్చు ఎక్కువ. 50 వేల కోట్ల పైన ఇప్పుడు అంచనాలున్నాయ్. అవి మరింతగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
పాత ధరలకే చెల్లింపులు చేస్తామని కేంద్రం అంటోంది. పైగా, పునరావాసం సమస్య తమది కాదన్నది కేంద్రం వాదన. తాజాగా పోలవరం ముంపు మండలాల్లో వరద బాధితుల్ని పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘వెయ్యి కోట్లు ఖర్చయ్యే పని అయితే, ఎలాంటి అభ్యంతరం లేకుండా మనమే చేసేవాళ్ళం.. కానీ, ఇరవై వేల కోట్లు ఖర్చవుతుంది.. కాబట్టి, అది కేంద్రమే చెయ్యాలి..’ అంటూ వ్యాఖ్యానించారు.
సో, వైఎస్ జగన్ చేతులెత్తేసినట్లేనన్నమాట. అయితే, పునరావాసం విషయంలో ప్రభుత్వం చెయ్యాల్సినదంతా చేస్తుందనీ, ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి చెల్లింపులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ చెప్పడం గమనార్హం.