YCP : వైసీపీ ఎంపీల రాజీనామా కోరుతున్న చంద్రబాబు.. నవ్విపోతారు సామీ.!

YCP : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాకి సిద్ధమైతే, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత.

అరరె, ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా.? 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ డైలాగుల్ని విన్నాం. ‘మేం రాజీనామా చేస్తాం, మీరూ రాజీనామా చెయ్యండి..’ అంటూ ప్రత్యేక హోదా విషయమై వైసీపీ, టీడీపీకి సవాల్ విసిరింది.

అప్పట్లో అధికారంలో వున్న టీడీపీ, ‘మేమెందుకు రాజీనామా చేస్తాం.? చేతనైతే మీరే రాజీనామా చెయ్యండి..’ అంటూ తప్పించుకుంది. వైసీపీ ఎంపీలు తెలివిగా, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చాక తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇప్పుడు మరి, టీడీపీ ఏం చేయబోతోంది.? ఇంకో రెండున్నరేళ్ళుంది సార్వత్రిక ఎన్నికలకి. కానీ, టీడీపీకి వున్నదే ముగ్గురు ఎంపీలు. అందులో కేశినేని నాని, టీడీపీతో వున్నారో లేదో తెలియని పరిస్థితి. గల్లా జయదేవ్ కూడా ఈ మధ్య బాగా సైలెంటయిపోయారాయె.

ముగ్గురు ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించగలరా.? అసలు ఆ ముగ్గుర్నీ ఒక్క తాటిపైకి చంద్రబాబు తీసుకురాగలరా.? పోనీ, ముగ్గురు ఎంపీలు రాజీనామా చేస్తే, ప్రత్యేక హోదా వస్తుందా.? మొత్తం వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసినా ప్రత్యేక హోదా వస్తుందా.?

రాజీనామాల వరకూ అవసరం లేదు. ఏపీకి చెందిన ఎంపీలంతా చేతులు కలిపి, పార్లమెంటు వేదికగా తామంతా ఒక్కటేనని నినదించి, కేంద్రాన్ని నిలదీయగలరా.? టీడీపీ, వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టినప్పుడు మాత్రమే, రాష్ట్ర డిమాండ్లకు కేంద్రం నుంచి స్పందన అనేది రావొచ్చు. అప్పటిదాకా చంద్రబాబు ఏం చేసినా అది కామెడీనే. చంద్రబాబు మాత్రమే కాదు, వైసీపీ నుంచి ఇలాంటి ప్రకటనలొచ్చినా, అవీ కామెడీలే అవుతాయ్.