రాష్ట్రానికి మూడు రాజధానులుండాలన్నది అధికార వైసీపీ పట్టుదల. మూడు కాకపోతే, ముప్ఫయ్ మూడు కట్టుకోండి.. ముందైతే, ఒక్కటన్నా వుండాలి కదా.? అన్నది సాధారణ ప్రజానీకం నుంచి ప్రభుత్వం వైపు దూసుకొస్తున్న ప్రశ్న. ఉత్తరాంధ్ర కోటాలో విశాఖ, రాయలసీమ కోటాలో కర్నూలు.. ఎటూ ఇప్పటికే వున్న రాజధాని అమరావతి.. వెరసి మూడు రాజధానులనే కాన్సెప్టు బాగానే వుంది. కానీ, ఏదీ ఎక్కడ.? అమరావతిని మూడేళ్ళలో ఏమాత్రం పట్టించుకోని వైఎస్ జగన్ ప్రభుత్వం, మూడేళ్ళలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంటే, నమ్మేదెలా.? మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇదే బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతగా వున్నప్పుడు విజయవాడ రాజధాని అయితే బావుంటుందని సెలవిచ్చిన సంగతి తెలిసిందే.
వైసీపీ నేత అయ్యాక, మంత్రి అయ్యాక.. అమరావతిని ముంపు ప్రాంతంగా పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలో రెండు సార్లు అమరావతి ప్రాంతం చుట్టూ వరదలొచ్చాయి. కానీ, అమరావతిలో ఏ చిన్న భాగమూ మునిగిపోలేదు. అధినేత మెప్పు కోసం పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న ప్రకటనలతో అమరావతి భవిష్యత్తే కాదు, ఆంధ్రపదేశ్ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారైంది. రాజధాని లేని రాష్ట్రం ఎప్పటికీ బాగుపడే అవకాశం వుండదు. ఎందుకంటే, రాజధాని.. రాష్ట్రానికి ఆర్థికంగా అండదండగా నిలుస్తుంది. రెండేళ్ళలో అమరావతిని కాస్తయినా ఆదుకుని వుండి వుంటే, రాష్ట్రానికి అమరావతి ప్రధాన ఆదాయ వనరు అయి వుండేది. విశాఖ, కర్నూలు కూడా వైఎస్ జగన్ ఆలోచనల మేరకు అభివృద్ధి చెందాలి.. రాజధానులుగా వెలుగొందాల్సిందే. ఇంకో రెండు మూడు రాజధానులు అదనంగా.. కాదు కాదు, ప్రతి జిల్లా కేంద్రమూ ఓ రాజధాని అనేలా సమగ్రాభివృద్ధి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.? కానీ సమయం చాలా విలువైనది. రెండేళ్ళు కోల్పోయింది రాష్ట్రం. మరో మూడేళ్ళలో అయినా అమరావతిని బాగు చేసి, సమస్యలు తొలగితే మిగతా రెండిటిపైనా ఫోకస్ పెట్టడం మంచిది.