మంత్రులు పెద్దిరెడ్డి రామచందరారెడ్డి, బొత్స సత్యానారాయణ పంచాయితీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తమ పట్ల వ్యవహరించిన తీరుపై, అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఈ వ్యవహారం వెళ్ళింది. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన నిమ్మగడ్డ, ‘ఆ నోటీసులకు విచారణ పరిధి లేదు’ అని పేర్కొంటూ సమాధానమిచ్చారు.
ఈ మేరకు నిమ్మగడ్డ, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. శాసన సభ అంటే తనకు అపారమైన గౌరవం వుందని లేఖలో ప్రస్తావించిన నిమ్మగడ్డ, ఈ వ్యవహారానికి సంబంధించి తగినన్ని ఆధారాల్ని సమర్పిస్తానని కూడా పేర్కొన్నారు. ఇటీవల కోవిడ్ 19 టీకా తీసుకోవడం జరిగిందనీ, ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని లేఖలో ప్రస్తావించారు నిమ్మగడ్డ.
ఎస్ఈసీ నిమ్మగడ్డ త్వరలో పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, పదవిలో వున్నా లేకపోయినా.. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని అధికార పార్టీ చెబుతోంది. అసలు విచారణ పరిధే లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు. వీటిల్లో ఏది నిజం.? ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉదంతాన్ని ప్రశ్నిస్తూ, నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. ఆయన్ని కోర్టులు కూడా రక్షించజాలవు.. అని అధికార పార్టీ కుండబద్దలుగొట్టేస్తున్న సంగతి తెలిసిందే.