Janasena : జనసేనకు అదే పెద్ద సమస్య.! అధిగమించేదెలా.?

Janasena : జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అభిమానులే వరం.. ఆ అభిమానులే శాపం కూడా. రాజకీయ పార్టీలకు కార్యకర్తలుండాలి.. అభిమానులు కూడా వుండొచ్చుగాక. కానీ, అభిమానులకీ.. కార్యకర్తలకీ చాలా తేడా వుంది. కార్యకర్తలు పార్టీ కోసం పని చేస్తారు.. అభిమానులు, కేవలం అభిమానంతోనే సరిపెడతారు. అలాగని అభిమానులు, కార్యకర్తలుగా పనిచేయరని అనలేం. అభిమానంలో మళ్ళీ దురభిమానం వేరు.!

జనసేన పార్టీకి ఈ దురభిమానులతోనే పెద్ద సమస్య. తాజాగా, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకర్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపేస్తానంటూ సోషల్ మీడియాలో ట్వీటేసినందుకుగాను సదరు అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతను కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే కాదు, ప్రభాస్ అలాగే మహేష్‌బాబుని కూడా అభిమానిస్తాడట. అలాగని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టుకున్నాడు. తాను జనసేన మద్దతుదారుడిననీ చెప్పుకున్నాడు అందులో.

అయితే, అభిమానులని చెప్పుకుంటున్నోళ్ళంతా నిజమైన అభిమానులనీ అనలేం. ట్విట్టర్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆయా నటీనటులకు లేదా పార్టీలకు మద్దతుగా మాట్లాడుతున్నారు గనుక, ఫలానా నటీనటులకో లేదంటే రాజకీయ పార్టీలకో వాళ్ళు నిఖార్సయిన అభిమానులని అనుకోవడానికీ వీల్లేదు.

ఫాలోవర్స్‌ని పెంచుకునే క్రమంలో కొందరు నెటిజన్లు తొక్కే అడ్డదారుల్లో ఇదీ ఒకటి. కాగా, జనసేన పార్టీ.. సోషల్ మీడియాలో జనసైనికులు హద్దులు దాటొద్దంటూ తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది. జనసైనికులు ఎలా సోషల్ మీడియాలో వ్యవహరించాలో గతంలోనే ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది, అందులో పలు సూచనలూ చేసింది.

 Hereఅయినాగానీ, జనసేన పార్టీకి మద్దతిస్తోన్న చాలామంది.. సోషల్ మీడియాలో వెర్రి పోకడలు ప్రదర్శిస్తున్నారు. అధికార వైసీపీలోనూ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలోనూ ఇలాంటోళ్ళున్నారు. అయితే, జనసేన పార్టీనే ఎక్కువగా కార్నర్ అవుతోంది ఇలాంటి విషయాల్లో.