Thaggede Le : ‘అన్నీ చేశాం.. అయినా, ప్రభుత్వం మీద ఎందుకీ వ్యతిరేకత.?’ అంటూ అధికార వైసీపీ నుంచి పలువురు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఉద్యోగ సంఘాల మీద గుస్సా అయితే ప్రయోజనం లేదు. ‘ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే వుంది.. వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, ఆందోళన బాట పట్టడం సరికాదు..’ అంటూ పలువురు మంత్రులు, మీడియా ముందుకొచ్చి గుస్సా అవుతున్నారు.
కానీ, వైసీపీ అధినాయకత్వం.. కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మంత్రులు మాట్లాడే మాటల్ని చూస్తోంటే, తమ పాలన పట్ల ప్రజలేమనుకుంటున్నారన్న సోయ కనీసం అధికార పార్టీకి వుండడంలేదన్న భావన కనిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన పని ఒత్తిడితో వుంటారన్నది నిర్వివాదాంశం. ఎవరు అధికారంలో వున్నా అంతే. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాలు అటకెక్కుతాయి. అదే సమయంలో భజన బృందం కారణంగా, కింది స్థాయిలో పార్టీ ఏమవుతోందో, ప్రభుత్వం ఏమవుతోందో సరైన సమాచారం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళదు. ఇప్పుడూ అదే జరుగుతోందా.? అంటే, ‘ఔను’ అనుకోక తప్పని పరిస్థితి.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. ఇది బహిరంగ రహస్యం. అప్పటినుంచి ఇప్పటిదాకా ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వానికి మంచి సహకారమే లభిస్తోంది. మరి, ఆ ఉద్యోగులే ఇప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే పరిస్థితి ఎందుకొచ్చింది.
’20 వేల కోట్ల భారం కొత్తగా ప్రభుత్వంపై పడుతోంది.. అంటే, అదంతా ఉద్యోగుల కోసం వెచ్చిస్తున్నదే కదా..’ అంటున్నారు మంత్రులు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఉద్యోగుల వేతనాలు తగ్గుతున్న వైనాన్ని ఓ మంత్రి, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలోనే లెక్కలేసి తేల్చేసి, గతుక్కుమన్నారు. ఇదీ వాస్తవం.! ఆయనెవరో కాదు మంత్రి అప్పలరాజు. ప్రభుత్వం ఇకైనా వాస్తవ పరిస్థితిని గుర్తిస్తుందా.? అధికార వైసీపీ తమ తప్పుల్ని సరిదిద్దుకుంటుందా.? వేచి చూడాలి.