అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే నేరుగా సంబంధాలున్నాయనీ, వేల కోట్లు ముఖ్యమంత్రి జేబుల్లోకి డ్రగ్స్ అమ్మకాల ద్వారా వెళుతున్నాయనీ టీడీపీ ఆరోపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎంత దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. తమ మీద టీడీపీ చేస్తున్న దుష్ర్పచారానికి ధీటుగా వైసీపీ కూడా ఎదురు దాడికి దిగింది. ‘తెలుగు డ్రగ్స్ పార్టీ’ అంటూ టీడీపీ మీద వైసీపీ విరుచుకుపడుతోంది.
టీడీపీ, వైసీపీ మధ్య పోరులో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పరువు ప్రతిష్ఠలు బజారున పడుతున్నాయి. ఎలాగోలా పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం టీడీపీ నానా రకాల అడ్డదారులు తొక్కుతోంది. డ్రగ్స్ దుష్ర్పచారం కూడా అలాంటిదే. ఇక వైసీపీ కూడా ఈ విషయంలో సంయమనం కోల్పోతోంది. టీడీపీ వ్యూహానికి చిక్కేస్తోంది.
డ్రగ్స్ – రాజకీయాలు.. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. ఎందుకంటే, రాజకీయ వ్యవస్థ సరిగ్గా పని చేస్తే డ్రగ్స్ ఊసే ఉండదు. అధికార యంత్రాంగం ఎంత సమర్ధవంతంగా పని చేసినా, రాజకీయ ఒత్తిళ్లే డ్రగ్స్ కేసుల్ని నీరు కార్చుతున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ కేసులు ఎలా డైల్యూట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.
మంత్రి కేటీఆర్‌కి డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించడం చూశాం. రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. దావా వేశారా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. వాస్తవానికి డ్రగ్స్ లాంటి తీవ్రమైన వ్యవహారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఒక్క తాటిపై ఉండాలి. సమాజాన్ని డ్రగ్స్‌కి దూరంగా ఉంచగలగాలి. కానీ, నిస్సిగ్గుగా అడ్డగోలు రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు.
ఏపీ రాజకీయాల విషయానికి వస్తే, ‘తెలుగు డ్రగ్స్ పార్టీ’ అని ఆరోపించే బదులు, అధికారం తన చేతిలోనే ఉంది కనుక కేసులు పెట్టి దోషుల్ని శిక్షించవచ్చు. కానీ, ఆ పని చేయరు.