లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఆంధ్రలో (సీమాంధ్ర) పుట్టినోళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులేనంటూ గతంలో.. అంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకటికి పదిసార్లు తెలంగాణ ప్రాంత నాయకులు.. అందునా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు గట్టిగా నినదించారు. సెంటిమెంటుని రగిల్చే క్రమంలో సీమాంధ్రులపై విషం చిమ్మారు.
ఈ వ్యవహారంలో అందరికన్నా ఎక్కువ స్థాయిలో విరుచుకుపడింది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఓ సందర్భంలో ‘ఆంధ్రోళ్ళతో పంచాయితీ ఇంకా అయిపోలేదు..’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, గ్రేటర్ ఎన్నికల సమయంలో సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ నేతలు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ సెంటిమెంటుని రగిల్చేందుకు సీమాంధ్రుల్ని రాక్షసులతో పోల్చే యత్నం షురూ అయ్యింది. ‘లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఆంధ్రలో పుట్టినోళ్ళెవరూ తెలంగాణ మేలు కోరుకోరు..’ అంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇంతకన్నా దారుణం ఇంకేమైనా వుంటుందా.? కృష్ణా నదీ జలాల విషయమై రెండు రాష్ట్రాల మధ్య చిన్నపాటి బేదాభిప్రాయాలున్నాయి. అంతమాత్రాన, ఆ గొడవల్ని ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తే ఎలా.? తెలంగాణలోనూ, ఆంధ్రపదేశ్ లోనూ.. రెండు రాష్ట్రాల్లో వున్నది తెలుగు ప్రజలే. తెలంగాణోళ్ళు ఆంధ్రోళ్ళ నాశనం కోరుకోరు.. ఆంధ్రోళ్ళు తెలంగాణోల నష్టాన్ని కోరుకోరు. రాజకీయ నాయకులు తమ అవసరానికి తగ్గట్టు రంగులు మార్చేస్తారు. ఈ క్రమంలోనే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్ అస్త్రాల్ని ప్రయోగిస్తుంటారు. ఇంకా ఈ రాజకీయ పైత్యం నేతల్లో ఇంకెన్నాళ్ళు.? అని ఇరు రాష్ట్రాల్లోని ప్రజలూ ప్రశ్నిస్తున్నారు.