వైఎస్ జగన్ తుఫాన్ తాకిడి ప్రభావం ఎలాంటిదో టీడీపీ నేతలను అడిగితే కరెక్టుగా చెప్పేస్తారు. ఎలక్షన్లలో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్నారు టీడీపీ నేతలు. కేవలం జగన్ అనే ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశంలోని మహామహులైన సీనియర్ నేతలందరినీ మట్టికరిపించేశారు. ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ తానే తెలుగుదేశానికి వ్యతిరేకంగా అభ్యర్థిగా నిలబడినట్టు ఏకంగా 151 స్థానాలను కైవసం చేసుకున్నారు. అంతటితో ఆగని ఆయన అవినీతిపరుల ఆటలు కట్టిస్తాను అంటూ ఏరివేత మొదలుపెట్టారు. ఎందుకంటే జగన్ ఏరుతున్న అవినీతిపరుల్లో తెలుగుదేశం నేతలే ఎక్కువ ఉన్నారు.
టీడీపీలో తలపండిన సీనియర్ నేతలు చాలామంది ప్రభుత్వం చేతికి చిక్కారు. జేసీ, అచ్చెన్నాయుడు లాంటివారు గట్టిగా బుక్కయ్యారు. అరెస్టై జైలుకు వెళ్లారు. అతికష్టం మీద బెయిల్ రావడంతో బయటపడ్డారు. ఇక కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, మద్దాలి గిరి, గీతం చైర్మన్ శ్రీభరత్, గల్లా జయదేవ్ అందరూ జగన్ దెబ్బ తిన్నవారే. అందరి ఆర్ధిక మూలాల మీద దెబ్బ పడింది. ఆ కారణంగానే కొందరు పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే తెలుగుదేశం నేతలకు నచ్చట్లేదు. ఎలాగైనా జగన్ మీద పగ సాధించాలని భావిస్తున్నారు.
దెబ్బకు దెబ్బ తీయడానికైనా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అంతెందుకు తెలుగుదేశం నేతలు చాలామంది బహిరంగంగానే తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తామని అన్నారు. దీన్నిబట్టి జగన్ మీద వారికెంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడైతే ఇప్పటి నుండే జగన్ పాలనలో జరిగిన అవినీతికి లెక్కలు రాయడానికి ఒక డైరీ మైంటైన్ చేస్తున్నానని అన్నారు. అంటే టీడీపీ నేతలకు అధికారం అనేది కేవలం జగన్ మీద పగ సాదించడానికే అనిపిస్తోంది. మొత్తానికి ఇక మీదట టీడీపీ నడపబోయేది మొత్తం రివెంజ్ డ్రామా అని అనిపిస్తోంది.