TDP To Give CM Chair : పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రతిపాదించనున్నారట.!

TDP To Give CM Chair : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇవ్వనున్నారా.? ఆ దిశగానే 2024 ఎన్నికల కోసం టీడీపీ – జనసేన మధ్య సయోధ్య కుదరబోతోందా.? రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే అంశంపై హాటు హాటుగా చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి జనసేన పార్టీ సహకరించింది. అప్పట్లో బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకోగా, జనసేన పార్టీ ఆ రెండు పార్టీలకూ మద్దతిచ్చింది తప్ప, తాను స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ‘అప్పుడు మీకు సహకరించాం.. ఇప్పుడు మాకు సహకరించండి..’ అంటూ జనసేన మద్దతుదారులు కొందరు సోసల్ మీడియా వేదికగా టీడీపీ అధినేతకు సూచిస్తున్నారు.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనల్లో వుంది. ‘బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి వస్తాయి.. సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అవుతారు..’ అంటూ పలు సందర్భాల్లో బీజేపీ స్పష్టత ఇచ్చింది కూడా.

పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అన్న విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరాల్లేనప్పుడు, ఆ పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి టీడీపీ సహకరిస్తే, బీజేపీ కూడా అందుకు సమ్మతించే అవకాశాలున్నాయి. అయితే, ఇదంతా జరిగే పనేనా.? ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు కాదనుకుంటారా.? ఛాన్సే లేదు.

పవన్ కళ్యాణ్ నుంచి మద్దతు కావాలి.. అదే సమయంలో బీజేపీ కూడా తనకు మద్దతివ్వాలి.. అన్న ఆలోచనల్లో చంద్రబాబు వున్నారు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అలాగే వుంటాయ్. ఇక, జనసైనికుల ఆశలు, అంచనాల సంగతంటారా.? వాటిని తొక్కిపెట్టేయడం టీడీపీ అధినేతకు పెద్ద కష్టమేమీ కాదు.