ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించడంతో, ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ఇది నిజంగానే బీజేపీ – జనసేన కూటమికి బంపర్ ఆఫర్. రాష్ట్రంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందనే భావనలో వున్న బీజేపీ – జనసేన, పరిషత్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగలిగితే, ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు ఇదొక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి గనుక ఈ రెండు పార్టీల కూటమి గట్టి పోటీ ఇవ్వగలిగితే, సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం వుండదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న టీడీపీ గురించి మాట్లాడటం దండగ.. అని తేల్చి పారేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తీరుని ఖండిస్తున్నామనీ, అయితే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం జరుగుతుందనీ సోము వీర్రాజు తేల్చిచెప్పారు. అధికార పార్టీ వైఫల్యాల్నీ ప్రజా క్షేత్రంలో ఎండగట్టడానికి ఇదొక అద్భుతమైన అవకాశమన్నది బీజేపీ వాదనగా కనిపిస్తోంది. అయితే, గత ఏడాది నడిచిన నామినేషన్ల పర్వం నేపథ్యంలో బీజేపీ – జనసేన నుంచి ఎక్కువమంది అభ్యర్థులు బరిలోకి దిగలేకపోయారు. ఆ రకంగా చూస్తే, చాలా సీట్లు ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువ. పోటీ చేసే స్థానాల్లో మాత్రం జనసేన – బీజేపీకి మంచి అవకాశం దొరకొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక ముందర.. బీజేపీ – జనసేన కూటమికి ఇదో అద్భుతమైన అవకాశం.. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్థానాన్ని భర్తీ చేయడానికి. ఇదిలా వుంటే, పార్టీ ముఖ్య నేతలు ‘బహిష్కరణ’ నిర్ణయంపై నిరసన గళం విప్పుతున్న దరిమిలా, టీడీపీ అధినేత చంద్రబాబు ఏ క్షణంలో అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చనే వాదనా లేకపోలేదు.