ఏపీకి రాజధానిగా మరో కొత్త ప్రాంతాన్ని తెరపైకి తెస్తున్న టీడీపీ నాయకులు

tdp telugu rajyam

ఏపీలో రాజధానికి మించిన సమస్య లేదు. అక్కడ ఉన్న నాయకులకు రాజధాని అంశం తప్ప మరో అంశం కనిపించదు. ఏ రాజకీయ నాయకుడు నోరు కదిపినా కూడా మొదటి మాట, చివరి మాట రాజధాని మాత్రమే ఉంటుంది. రాజధానిని అమరావతిలో పెట్టకూడదని వైసీపీ నాయకులు, అక్కడే పెట్టాలని టీడీపీ నాయకులు. ఇవే వాదనలు చేత ఇప్పటికే 17 నెలల కాలాన్ని వైసీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు వృధా చేశారు. అయితే ఇప్పుడు రాజధాని కోసం మరో కొత్త ప్రాంతాన్ని టీడీపీ నాయకులు తెరపైకి తెస్తున్నారు.

రాజధాని కొత్త ప్రాంతం ఏంది ?

విశాఖపట్నం, కర్నూల్, అమరావతి ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ఉంటే అమరవతిలోనే ఉండాలి లేదంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండాలని ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతిని మాత్రమే రాజధానిగా నియమించాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో టీడీపీ నేతలే ఇలా వేరే ప్రాంతల పేర్లు చెప్పడం పట్ల వైసీపీ నాయకులు అవహేళన చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఎందుకు ఉండాలో, విశాఖపట్నంలో ఎందుకు ఉండకూడదో చెప్పడం చేతకాని టీడీపీ నాయకులు ఇలా అర్థంపర్ధం లేని వాదనలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

బీజేపీ మాట నిజమయ్యే సమయం అసన్నమైందా!

ఏపీకి రాజధానుల విషయంలో చివరికి బీజేపీ నాయకుల చెప్పిన మాట నిజమయ్యేలా ఉంది. మూడు రాజధానుల విషయంలో తాము కలిపించుకోలేమని కోర్ట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన తరువాత ప్రజల్లోకి వచ్చిన బీజేపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 13 రాజధానులు చేస్తామని చెప్పారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీ నాయకుల వాదనలు వింటుంటే రానున్న రోజుల్లో ఇదే నిజం కానుందని అనిపిస్తోంది. రాజధాని ఎక్కడ ఉన్నా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. ఎలాగంటే మన దేశానికి రాజధాని ఢిల్లీ కానీ దేశ ఆర్థిక రాజధానిగా ముంబై మారింది. ఇలా అభివృద్ధిపై దృష్టి పెడితే అన్ని ప్రాంతాలను రాజధాని కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేయవచ్చు. అయిన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడి నాయకులకు అభివృద్ధి కంటే కూడా గొడవలు, పదవులు, పార్టీ ఇవే ముఖ్యమని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది.