అసలు జనమే రారనుకున్నారుగానీ.. అంచనాలకు మించిన జనం మహానాడులో కనిపించారు. టీడీపీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చాలామంది టీడీపీ నేతలు మాట మీద అదుపు కోల్పోయారు. అత్యుత్సాహంతో కొందరు టీడీపీ నేతలు తొడలు కొట్టేశారు.. బూతులు తిట్టేశారు.!
ఇదీ మహానాడు జరిగిన తీరు క్లుప్తంగా. అధికార వైసీపీ మీద, ప్రతిపక్షం విమర్శలు చేయడం షరామామూలు వ్యవహారమే. ఇందుకోసం ప్రత్యేకంగా మహానాడు ఏర్పాటు చేసుకోవడమేంటి.? అన్న డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు. వైసీపీ మీద విమర్శలు వుండకూడదన్న రూల్ ఏమీ లేదు.
కాకపోతే, వైసీపీని తిట్టడం కోసం మహానాడు పెట్టుకున్నారనేట్టుగా మహానాడు నిర్వహిస్తే ఎలా.?
పోలీసులు, మా కార్యకర్తల వాహనాల టైర్లలోని గాలి తీసేశారు.. పోలీసులెవరూ మహానాడుకి సహకరించలేదు.. ఇలా సాగింది టీడీపీ వ్యవహారం.
టీడీపీ హయాంలో వైసీపీ నేతలు, కార్యకర్తల విషయంలో ఇలాగే కదా వ్యవహరించింది.? అప్పడు ఒకలా.. ఇప్పుడు ఇంకోలా.. అంటే ఎలా కుదురుతుంది.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. పోలీసుల్ని అధికారంలో వున్న పార్టీలు అడ్డంగా వాడేసుకుంటున్నాయి. సో, పోలీసుల్ని ఈ విషయంలో ఏమీ అనడానికి వీల్లేదు. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు.. రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు.
ఇంతకీ, ‘మహానాడు’తో టీడీపీ సాధించిందేంటి.? మహానాడు హంగామా ముగిశాక.. టీడీపీ శ్రేణులకు నీరసమొచ్చినట్టుంది. అంతా
సైలెంటయిపోయారు. ఓ రెండ్రోజులాగి మళ్ళీ హంగామా మొదలవుతుంది. ఇంతకీ, ‘మహానాడు’లో పార్టీకి పనికొచ్చే అంశాలపై చర్చ జరిగిందా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.