Health Tips: అయోడిన్ లోపంతో బాధపడుతున్నారా? ఐతే ఈ ఆహార పదార్థాలు తప్పని సరి..!

Health Tips:మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు లభించాలి. శరీరం వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండ ఉండాలంటే వారి రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. మనిషి యొక్క రోగ నిరోధక శక్తి వారు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. శరీరానికి క్యాల్షియం, ఐరన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటితో పాటు అయోడిన్ కూడా ఎంతో అవసరం. శరీరానికి అయోడిన్ తక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతారు. మనం తినే ఆహారంలో అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉప్పు తయారీ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉప్పు తయారీదారులు యూనివర్శల్ సాల్ట్ అయోడిసేషన్ (USI) ప్రమాణాలు పాటించాలని ఆదేశించింది. దీని ప్రకారం 20 కిలోల లోపు బరువు ఉన్న ఉప్పుకు ఖచ్చితంగా అయోడిన్ ను ఉపయోగించాలి అని పేర్కొంది.

అయోడిన్ లోపం ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. శరీర అవయవాల ఎదుగుదల బాగుండాలి అంటే శరీరానికి సరిపడా అయోడిన్ అవసరం. హార్మోన్ల, థైరాక్సిన్ ఉత్పత్తి బాగా ఉండాలి అన్న కూడా అయోడిన్ ఎంతగానో తోడ్పడుతుంది. అయోడిన్ ను శరీరము ఉత్పత్తి చేయలేదు. ఇది మనం తినే ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి లభిస్తుంది. శరీరం యొక్క జీవక్రియ కూడా అయోడిన్ మీద ఆధారపడి ఉంటుంది.

అయోడిన్ లోపిస్తే:
శరీర బరువు భారీగా పెరుగుతుంది. జీవక్రియ మందగిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోయి హైపోథైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కంటి చూపు, జ్ఞాపకశక్తి మందగిస్తాయి. ఎక్కువగా అలసట, బలహీనతలకు లోనవుతారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ టెన్షన్ పడుతూ డిప్రెషన్ కు లోనవుతారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గర్భందాల్చిన స్త్రీలకు గర్భధారణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అయోడిన్ లోపం కలగకుండా ఏమీ చేయాలి:
అయోడైజ్డ్ ఉప్పును రోజుకు కనీసం 10 గ్రాములు అయిన తీసుకోవాలి. అయోడిన్ ఎక్కువగా సముద్రంలో లభించే వాటిలో ఉంటుంది. మీకు అయోడిన్ లోపం కలుగకుండా ఉండాలి అంటే చేపలు, పీతలు, రొయ్యలు వంటివి వారంలో కనీసం రెండు సార్లయినా తినటం ఉపయోగకరం. అరటి పండ్లు, దానిమ్మ, స్ట్రాబెరీ, బంగాళదుంప, పాలు, పెరుగు, కోడిగుడ్లలో అయోడిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వారంలో కనీసం మూడు సార్లు అయిన పాలకూర తో వండిన పదార్థాలు తినడం వల్ల అయోడిన్ లోపం కలగకుండా ఉండవచ్చు. శరీరానికి సరిపడా అయోడిన్ ను అందించడమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.