YSRCP : వైసీపీలో అసంతృప్తి చల్లారలేదు.. చాపకింద నీరులా విస్తరిస్తోంది.!

YSRCP :  అసంతృప్తిని చల్లార్చేశామనుకుంటోంది వైఎస్సార్సీపీ అధిష్టానం. కానీ, అది చల్లారిపోలేదు. చల్లారిపోయినట్టు కనిపిస్తోందంతే. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కావొచ్చు, మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావొచ్చు.. పదవులు పోగొట్టుకున్న మిగతావారు, పదవుల్ని ఆశించి భంగపడ్డవారు.. వైఎస్ జగన్ పిలిచి మాట్లాడటంతో కూల్ అయిపోయారనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

‘పదవులు దక్కలేదన్న బాధ వుంది. అలాగని పార్టీ లైన్ ధిక్కరించలేం..’ అని ఆయా నేతలు మీడియా ముందు దాదాపుగా ఒకే తరహా సమాధానమిచ్చారు. అంటే, అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వున్నాయన్నమాట.

డిక్టేటర్‌షిప్ నడుస్తోంది వైసీపీలో అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం వుండకపోవచ్చు.

పైకి తప్పక నవ్వేవారు, తెరవెనుకాల చేసే వ్యవహారాలు వేరేలా వుంటాయ్. సర్దుకుపోయినట్టు కనిపిస్తూనే, తాము చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతారు. చాపకింద నీరులా అసంతృప్తి సెగలు విస్తరిస్తున్నాయి. కింది స్థాయిలో నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది.

వ్యవహారం దిష్టిబొమ్మల వరకూ వెళ్ళిందంటే, డ్యామేజీని కంట్రోల్ చేయడానికి వీల్లేదని అర్థం. అయినా, ఆల్ ఈజ్ వెల్.. అనుకుంటోంది వైసీపీ.
2024 వరకూ కాదు, ఈలోగానే పరిస్థితులు తారుమారైపోతాయన్న చర్చ వైసీపీలోనే జరుగుతున్నా, వైసీపీ కోటరీ మాత్రం.. అధిష్టానానికి అన్ని విషయాలూ సవివరంగా చెప్పలేకపోతుండడం గమనార్హం.