దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన రావుల శ్రీధర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నా బీజేపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. తనతో పాటు మరో వెయ్యి మంది బీజేపీ కార్యకర్తలు త్వరలో గులాబీగూటికి చేరనున్నారని ప్రకటించారు.
గత 11 సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేస్తున్నా తనకు తగిన గుర్తింపు లభించనందు వల్లే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో కేంద్ర రాష్ట్ర శాఖల మధ్య సమన్వయం లోపించిందని అన్నారు. కేంద్రం తీసుకొచ్చే కీలకమైన బిల్లులపై రాష్ట్ర పార్టీ కనీసం చర్చ కూడా జరపడం లేదని ఆరోపించారు. దీనికి తోడు వర్గ పోరు బీజేపీలో ఎక్కువైందని అందుకే తనకు తగిన ప్రాముఖ్యత లభించలేదని మండిపడ్డారు.
2018 ఎన్నికల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి శ్రీధర్ రెడ్డి పోటీ చేయగా ఈయనపై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. లక్ష్మణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తగిన ప్రాముఖ్యత లభించినప్పటికీ …. బండి సంజయ్ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈయనకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యనే అధిష్టానం నియమించిన రాష్ట్ర బీజేపీ కమిటీలో శ్రీధర్ రెడ్డికి స్థానం దక్కలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.