నిజమైన మాస్ హీరో కు తెలుగురాజ్యం నివాళులు!

విజయకాంతంటే సింధూరపువ్వు, కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారిల సంచలనాలతో తెలుగునాట కూడా బ్రహ్మాండంగా విరాజిల్లిన మొదటి తమిళహీరోగానే తెల్సు నిన్నటిదాకా..

కానీ తమిళ మిత్రుల నుంచి అతగాడి గొప్పదనం గురించి తెల్సుకున్నాకా చాలా గౌరవం కలిగింది..!

కెప్టెన్ అంటేనే అదుపులేని భావోద్వేగాలకి, కడుపులోది తీసి పెట్టే అనురాగాలకి పెట్టింది పేరు..

కథ చెప్పడానికొచ్చిన సహాయ దర్శకులకైనా, కబుర్లాడటానికొచ్చిన సన్నిహితులతోనైనా విజయకాంత్ ది ఒక్కటే మాట..

“తిన్నావా లేదా అది చెప్పు ముందు… లేదంటే చెయ్యి కడుక్కుని రా తిందువుగానీ.. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం..!!”

తండ్రి ఓ ధాన్యంమిల్లు యజమాని కాబట్టే అన్నం విలువ అంత బాగా తెలుసనుకుంటా.. ఈయన ఎంతమంది కడుపు నింపాడో
లెక్కేలేదట..!

స్థాయినిబట్టి ఆకలిని తూకం వేసే సినీమాయా ప్రపంచంలో “ఎవ్వరి ఆకలైనా ఒక్కటే, హీరోహీరోయిన్ల నుంచి లైట్ మెన్లదాకా అందరికీ ఒకే ఆహారం అందించాలని” చిన్నసైజు ఉద్యమంలాంటిది లేవదీయడమేగాక తన అన్ని సినిమాలకి అదే ఫాలో అయిన సిసలైన హీరో..

రంగు ప్రాతిపదికన అవకాశాలు కల్పించే పరిశ్రమలో చర్మమనేది మాసిన బట్ట మాత్రమేననే మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి వర్ణవివక్షకి ఎదురెళ్ళి నిలిచి, గెలిచి “కరుప్పు ఎంజీయార్” అని ముద్దుగా పిలిపించుకున్న మొనగాడు..!

ఇంటావంటా లేని సినిమాల్లోకి అడుగుపెట్టిన విజయకాంత్ కి ఎన్నెన్ని అవమానాలు..

ఇంగ్లీష్ సరిగ్గా రాదు.. డ్యాన్సులు చేతగాదు.. ఇక అందం గురించి చెప్పక్కర్లేదు.. హీరో అవుతాట్ట హీరో..!!

హేళనల్ని సవాలుగా తీసుకున్నాడు.. కష్టపడి ఎదిగి తనలాగే వివక్షని ఎదుర్కొనే అభాగ్యులకి అండదండలు అందించాడు..

అక్కణ్ణుంచి.. ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది బయటికొచ్చిన విద్యార్థులకి అవకాశాలు కల్పించాలంటే గుర్తొచ్చే మొదటి ఆశాదీపం విజయకాంత్..

ఏదన్నా కాస్త ప్రాధాన్యమున్న పాత్రలో కనబడి పేరు తెచ్చుకుందామనుకునే కొత్త హీరోలకి తెరమీద తన పక్కన ఇంతచోటిచ్చే ఊతం పేరు విజయకాంత్..

మారు మాట్లాడకుండా దర్శకుడికి అపరిమిత స్వేచ్ఛనివ్వడంలోనూ, చెప్పింది చెప్పినట్టు పోషించడంలోనూ ఉన్నారా అంటే ఆ పవర్ హౌస్ పేరు విజయకాంత్..

పహిల్వాన్ రంగనాధన్ అని అందరికీ గుదిబండలా మారిన ఓ మాజీ కండల గండడుగారున్నారు.. యూట్యూబ్ ఛానెళ్ల సాక్షిగా ఆ దుర్వాసుని నోట్లో పడనివాళ్ళు, తిట్లు తిననివాళ్ళు లేరు.. అలాంటి సింహంగారు పొగిడిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈ చల్లటి మనసున్న విజయకాంత్..

ఆకలితో గుమ్మం ఎక్కే అభాగ్యులకి వేళలతో సంబంధం లేకుండా కడుపునిండా అన్నం పెట్టి పంపించడం, తనతో పన్జేసిన అందర్నీ ఒకేలా గౌరవించి, వాళ్ళకి యే ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడం.. పోషించిన పాత్రేదైనాగానీ తన నిజజీవిత భావజాలాన్నే తెర మీద కూడా ఉండేలా చూసుకోవడం.. ఇవన్నీ మన సోషల్ మీడియా తరానికి పెద్దగా పరిచయం లేని కెప్టెన్ ప్రత్యేకతలు..

తెరమీద ఈలలేయించే మాస్ హీరోలు ఎంతోమందుండొచ్చు.. తెర బయట కూడా నీరాజనాలు అర్పించాలనిపించే నిజమైన మాస్ హీరోలు కొంతమందే ఉంటారు.. అంతటి తెరవేల్పుని మించిన ఇమేజీ కలిగిన విజయకాంత్ పోయాడంటే ఎంతోకొంత బాధ కలుగక మానదు..!