Special Status For AP : ప్రత్యేక హోదా: కేంద్రంపై ఒత్తిడి తేవడమా.? కాళ్ళు ఒత్తడమా.?

Special Status For AP : ప్రత్యేక హోదా విషయమై కేంద్రంపై మా ఒత్తిడి కొనసాగుతుందంటూ వైసీపీ నేతలు, ముఖ్యంగా కీలక పదవుల్లో వున్నవారు.. అంటే, మంత్రులు అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంతకీ, ‘ఒత్తిడి’ అంటే ఏంటి.? కేంద్రాన్ని నిలదీస్తే అది ఒత్తిడి పెట్టడం అవుతుంది. కానీ, అలాంటి నిలదీత వైసీపీ ఎంపీల నుంచి కనిపించడంలేదు.

‘అది ఒత్తిడి కాదు, కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు ఒత్తడం..’ అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద సెటైరే వేసింది వైసీపీ మీద. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ ఏం చేసిందో, ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. తేడా ఏంటంటే, అప్పట్లో టీడీపీ, బీజేపీకి అధికారిక మిత్రపక్షం. ఇప్పుడు వైసీపీ, బీజేపీకి అనధికారిక మిత్రపక్షం. అంతే తేడా.

బీజేపీ చట్ట సభల సాక్షిగా తీసుకొచ్చే అనేక బిల్లులకు వైసీపీ ఎలాంటి షరతులూ పెట్టకుండానే మద్దతిచ్చేస్తోంది. అంటే, బీజేపీకి వైసీపీ మిత్రపక్షం అన్నట్టే కదా. రాజకీయాల్లో వ్యూహాలు వుండొచ్చు.. వైసీపీ కూడా ఓ ఖచ్చితమైన వ్యూహంతోనే వ్యవహరిస్తుండొచ్చు. కానీ, అది రాష్ట్రం పట్ల బీజేపీ మరింత చిన్న చూపు చూడటానికి కారణమైతే ఎలా.?

బీజేపీ దృష్టిలో వైసీపీ అంటే చాలా అలుసు. గతంలో టీడీపీ విషయంలో బీజేపీ తీరు ఇలాగే వుండేది. వైసీపీ, తమ పార్టీకి బీజేపీ కారణంగా జరుగుతున్న డ్యామేజీని గుర్తించకపోతే, రాజకీయంగా చాలా నష్టపోతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి, బీజేపీ అసలు పోటీనే కాదు. సో, బీజేపీని వైసీపీ లైట్ తీసుకోవచ్చుగాక. కానీ, బీజేపీతో అంటకాగితే, అది వైసీపీకే నష్టం.